Ladakh Election Results 2023 :లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్- ఎల్ఏహెచ్డీసీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మొత్తం 22 సీట్లు గెలుచుకుని విజయదుందుభి మోగించింది. అక్టోబర్ నాలుగో తేదీన కౌన్సిల్‌లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 12 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్ర పక్షం కాంగ్రెస్ పది స్థానాల్లో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. బీజేపీ, స్వతంత్రులు తలా రెండుస్థానాల్లో గెలుపొందినట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసి, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలని అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో 77.61 శాతం ఓటింగ్ నమోదైంది. 95,388 మంది ఓటర్లలో 74,026 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ఉన్న హిల్డెవలప్మెంట్ కౌన్సిల్ పదవీకాలం అక్టోబర్ 1న ముగిసింది. కొత్తం కౌన్సిల్ అక్టోబర్ 11 లోపు కొలువుదీరుతుంది. ఎన్సీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ముందు కూటమిని ప్రకటించాయి. కానీ ఎన్సీ 17, కాంగ్రెస్ 22 మందిని ఎన్నికల్లో నిలబెట్టాయి. అయితే బీజేపీ బలంగా ఉన్న ప్రాంతానికే ఈ వ్యూహాన్ని పరిమితం చేసినట్లు ఇరు పార్టీలు తెలిపాయి. గతంలో ఒక సీటు గెలిచిన బీజేపీ ఈసారి 17 మంది అభ్యర్థులతో అదృష్టం పరీక్షించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. 25 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 278 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన కౌన్సిల్ ఎన్నికలకు తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు.
'ఇది భారత్ జోడో యాత్ర ప్రభావమే'
ఈ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది స్థానాలు గెలుచుకోవడంలో తమ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రత్యక్ష ప్రభావం ఉందని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు పదేళ్ల తర్వాత లద్దాక్ హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయాన్ని నమోదు చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.