బీసీ హాస్టళ్లలో సమస్యల విలయతాండవం- వసతి గృహాలో గోదాములో అర్థంకావట్లేదు జగన్ మామయ్య! Lack of Facilities in AP BC Welfare Hostels: అనకాపల్లి జిల్లా కశింకోట బీసీ సంక్షేమ వసతి గృహంలో 87 మంది పిల్లలు ఉంటే ఐదు స్నానపుగదులు, మరుగుదొడ్లున్నాయి. ఒక్కదానికీ తలుపుల్లేవ్. ఇక కిటీకీలైతే టూరింగ్ టాకీస్ కంతల్లా కనిపిస్తున్నాయి. పిల్లలు నిద్రపోయే గది కిటికీకి తలుపులు కాదుకదా కనీసం ఐరన్ మెష్ కూడా లేదు. పిల్లలే పాతదుప్పటి కట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మంచాలు లేకపోవడంతో నేల మీదనే నిద్రిస్తూ చలికి వణుకున్నారు.
విజయనగరం బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరింది. జగన్ బొమ్మతో పెట్టిన బ్యానర్ తప్ప స్విచ్ బోర్డు కూడా సరిగా లేని పరిస్థితి. ఎప్పట్నుంచో ప్రమాదకరంగా మారినా మార్చాలనే ఆలోచనే లేదు! పాత ప్లెక్సీలు, పాత దుప్పట్లే ఇక్కడి కిటికీలకు తలుపులు. మంచినీళ్లైతే పిల్లలే టిన్‌లు పట్టుకుని తెచ్చుకోవాల్సిందే. విజయనగరం జిల్లాలో 53 బీసీ వసతి కేంద్రాలుంటే 15వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.
మరో 15కేంద్రాలు నాడు-నేడుకు ఎంపికైనా ఇంతవరకూ మరమ్మతు పనులే ప్రారంభించలేదు. పార్వతీపురం బాలుర బీసీ హాస్టల్ గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. మరుగుదొడ్లైతే పాడుబడ్డ అవశేషాల్లా మిగిలాయి. పిల్లలు కాలకృత్యాల కోసం పొలాల్లోకి వెళ్లాల్సిందే. స్నానాలు ఆరుబయట చేయాల్సిందే.! ఎంత చలైనా కటిక నేలపై పడుకోవాల్సిందే.
జగన్ పరిపాలనలో ప్రభుత్వ వసతి గృహాల్లో 'సంక్షేమం నిల్ - సంక్షోభం పుల్'
విజయవాడలోని గుణదల బీసీ బాలుర వసతి గృహంలో పరిస్థితి మరీ దారుణం. 'బాత్రూమ్స్ డామేజ్డ్, నాట్ ఇన్ యూజ్ అని' రాసిపెట్టారే గానీ మరి ప్రత్యామ్నాయంగా ఎటువెళ్లాలో చెప్పలేదు. ఇవి ఎప్పటికి బాగవుతాయో, పిల్లలకు బిగబట్టుకునే కష్టం ఎప్పటికి తప్పుతందో తెలియని పరిస్థితి.
ఒంగోలులోని బీసీ కళాశాల వసతిగృహం ఎదుట డేంజర్ బోర్డు పెట్టడం మేలు. పిల్లలు బ్యాగులు పెట్టుకునే ఐరన్ ర్యాక్ ఒరిగి ఎప్పుడు ఏ బడుగుబిడ్డ మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఫ్యాన్ రాడ్ సీలింగ్‌కు వేలాడుతుంటే ఫ్యానేమో ఊడి మూలన పడింది. కరెంటు బోర్డులైతే మరీ ప్రమాదకరంగా తాయారయ్యాయి.
ఇక హైస్కూల్ పిల్లలుండే బీసీ బాలుర వసతి గృహంలో ఊడిన కరెంటు బోర్డు తాకొద్దని చేయొద్దని ఓ కాగితం అంటించి ఊరుకున్నారు. ఇక్కడ 90 మంది పిల్లలకు తొమ్మిదే మరుగుదొడ్లున్నాయి. గదికి ఒకే తలుపుంది. ఎండైనా, చలైనా అదే రక్షణ. గదులకు కిటికీలు పగిలిపోయాయి. జాలీలూ లేకపోవడంతో వర్షం పడితే జల్లు కొడుతోంది. దోమ తెరల‌్లేవు.! ఎప్పుడో ఇచ్చిన దుప్పట్లు చిరిగాయి. పడుకోడానికి ఇబ్బందిపడలేక పిల్లలే ఇళ్ల నుంచి చాపలు తెచ్చుకున్నారు.
Hostels Construction Stalled in Krishna University: కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రశ్నార్థకంగా వసతి గృహాల నిర్మాణం.. విద్యార్థులపై ఆర్థిక భారం
ఇక సత్యసాయి జిల్లా కొత్త చెరువు బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులది మరో కష్టం. బయటకు వెళ్లలేరు, లోపల ఉండలేరు. ఈ హాస్టల్ చుట్టూ మురుగు కాలువ ప్రవహిస్తోంది. ఇకచెప్పేదేముంది బయటకెళ్తే కంపు, లోపలికెళ్తే దోమల గుంపు. రోగాలబారిన పడుతున్నామని పిల్లలు వాపోతున్నారు.
లేపాక్షి బీసీ బాలుర వసతి గృహానికి సొంత భవనంలేదు. గతంలో ఉన్న భవనాన్ని ఐటీఐ కోసం తీసుకోగా, ప్రభుత్వం మరో భవనాన్ని కేటాయించలేదు. పాఠశాలలోని రెండు గదులను వసతి గృహంగా వినియోగిస్తున్నారు. వసతి సరిగాలేక నాలుగేళ్లుగా నరకం చూస్తున్నామని పిల్లలు వాపోతున్నారు.
కల్యాణదుర్గంలోని జూనియర్ కళాశాల బీసీ వసతి గృహ దుస్థితి మరీ దారుణం.! చూడడానికి మరుగుదొడ్లు వరుసగా ఉన్నా అవి పనిచేయక పిల్లలు బహిర్భూమికెళ్తున్నారు. అద్దె భవనంలో నడుస్తున్న ఈ బీసీ వసతి గృహంలో 150 మంది పిల్లలున్నా సౌకర్యాలు అస్సలు బాగోలేవు. ఒక ఫ్యాన్ రెక్క విరిగి అవిటిదైపోయింది. అనంతపురం జిల్లాలోని ఏ బీసీ హాస్టల్‌కు వెళ్లినా అక్కడ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి.
ఇవి రాష్ట్రంలోని బీసీ వసతి గృహాల దుస్థితికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 3వేల300 కోట్ల రూపాయలతో 'నాడు-నేడు' పనులు చేపడుతున్నామని ఏడాది క్రితం గంభీరమైన ప్రకటనలు చేయడమే తప్ప జగన్ ప్రభుత్వంలో పని చేసింది లేదు. పిల్లలు కనిపిస్తే మేనమామనంటూ ఊరడించే జగన్ వాళ్ల కష్టాలకు వాళ్లనే వదిలేస్తారా? నాలుగున్నరేళ్లలో మాటల్లో మమకారం కట్టిపెట్టి చేతల్లో ఉపకారం చేసుంటే పిల్లలు ఇలా కష్టాలు పడేవారా? బడుగు బిడ్డల తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.
Social Welfare Hostels Problems: నీళ్ల పప్పు.. పురుగుల అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు