మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో అమానవీయ ఘటన జరిగింది. బావులు తవ్వడం కోసం వెళ్లిన కూలీల పట్ల దారుణంగా ప్రవర్తించారు కాంట్రాక్టర్లు. రాత్రి సమయంలో కూలీలు ఎక్కడికీ వెళ్లిపోకుండా వారిని గొలుసులతో బంధించారు. అంతే కాకుండా వారికి రోజుకు ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు. మలమూత్ర విసర్జన కూడా వారు తవ్వే బావిలోనే చేయమనేవారు. ఆ మలాన్ని మళ్లీ బకెట్లకు ఎత్తించి బయటకు పోయించేవారు. ఇంతలా నరకం అనుభవించిన కూలీలు నిందితుల చెర నుంచి ఎలా బయటపడ్డారంటే?
హింగోలీకి చెందిన 12 మంది.. బావులు తవ్వేందుకు సంతోశ్ జాదవ్, కృష్ణ శిందే అనే కాంట్రాక్టర్ల వద్ద కూలీలుగా చేరారు. వీరితో రోజుకు 12 గంటలు చొప్పున గొడ్డు చాకిరి చేయించుకునేవారు ఇద్దరు కాంట్రాక్టర్లు. సరైన భోజనం కూడా పెట్టేవారు కాదు.. అంతే కాకుండా ఒక్క రూపాయి కూలీ కూడా ఇవ్వలేదు. వీరిని బంధీలుగా ఉంచి బావులు తవ్వించేవారు. అయితే ఈ కూలీల్లో ఒకరు తప్పించుకుని హింగోలీలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. స్థానిక పోలీసులకు జరిగిందంతా చెప్పాడు. దీంతో పోలీసులు దాడులు నిర్వహించి.. 11 మంది కూలీలను బావుల నుంచి బయటకు తీశారు. అనంతరం వారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇద్దరు కాంట్రాక్టర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే కూలీలను చిత్రహింసలకు గురిచేసే మరికొంత కాంట్రాక్టర్ల గురించి సమాచారం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై వ్యక్తుల అక్రమ రవాణా, నిర్భందించడం వంటి పలు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.