కరోనా భయాలతో సొంతూళ్లకు పయనవుతున్నారు మహారాష్ట్రలోని వలస కూలీలు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న వీరంతా లాక్డౌన్ విధిస్తే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన అనేక మంది కార్మికులు తమ గ్రామాలకు వెళ్లేందుకు లోకమాన్య తిలక్ టెర్మినస్‌తో పాటు.. ఔరంగాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. లాక్డౌన్ విధిస్తే వీరిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. భయంతో ఇళ్లకు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు.
వేరే దారిలేకే..
ఇప్పటికే కొందరు ఉపాధి కోల్పోయారు. మరికొందరి దుకాణాలు మూతపడ్డాయి. ఇది ఇలాగే కొనసాగి తమవద్ద ఉన్న కొద్దిపాటి డబ్బూ అయిపోతే తినడానికి తిండి దొరకదని.. అందుకే సొంత గ్రామాలకు వెళ్తున్నామని కొందరు కార్మికులు తెలిపారు.
గత సంవత్సరం మాదిరిగా మళ్లీ లాక్డౌన్ విధిస్తే ఇరుక్కుపోతామని.. సొంత గ్రామాలకు వెళ్లాల్సిందిగా తమ యజమానులు సూచించారని వారు అంటున్నారు. భుజాలపై పెద్ద సంచులతో బయలుదేరిన వీరిలో యూపీ, బిహార్, రాజస్థాన్‌లకు చెందిన కూలీలు అనేక మంది ఉన్నారు.
''ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయపెడుతున్నారు. ఇప్పటికే ఖడక్ ఎస్టేట్స్‌లో వ్యాపార కార్యకలాపాలు మూసేశారు. దానిపై ఆధారపడే నాలాంటి కార్మికుల ఉద్యోగం పోయింది. రాబోయే రోజుల్లో ఏం తినాలి? ఎలా జీవించాలి? అందుకే స్వగ్రామానికి బయలుదేరా.''