Kurla Building Collapse: మహారాష్ట్ర.. ముంబయిలోని కుర్లాస్ నాయక్ నగర్లో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరగ్గా.. అప్పటి నుంచి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో కొందరిని వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కూలిన భవనానికి పక్కన ఉన్న భవనం కూడా శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అందులోని వారిని ఖాళీ చేయించారు. ఘటనాస్థలిని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే పరిశీలించారు. భవనం ఖాళీ చేయాలని బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చినా అందులోని వారు స్పందించలేదని తెలిపారు. శిథిల భవనాల్లో ఉన్నవారు ఇకనైనా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.