student goes to school by one leg: చదువుకోవాలనే తపన ఉంటే వైకల్యం కూడా అడ్డు రాదని నిరూపిస్తున్నాడు ఓ బాలుడు. ప్రమాదంలో కాలు కోల్పోయినా నిరాశ చెందకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నాడు.
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన మహ్మద్ పర్వేజ్‌కు చాలా ఏళ్ల క్రితం ప్రమాదంలో కాలు కాలిపోయింది. అనేక శస్త్ర చికిత్సలు చేసినా..ప్రయోజనం లేదు. చివరకు పర్వేజ్ కాలును తొలగించారు వైద్యులు. దీంతో అప్పటినుంచి ఒంటికాలితోనే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న పర్వేజ్.. ఒక్క కాలితోనే గెంతుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళుతున్నాడు. తనకు ప్రభుత్వం వీల్‌చైర్‌ను ఇచ్చినా.. తమ గ్రామంలోని రోడ్డుపై నడిచే పరిస్థితి లేదంటున్నాడు పర్వేజ్. అందుకే నడిచి వస్తున్నాని చెప్పాడు. చదడమే కాకుండా తన మిత్రులతో కలిసి క్రికెట్, వాలీబాల్ లాంటి క్రీడలన్నీ ఆడుతున్నాడు.
"2009లో జరిగిన ప్రమాదంలో నా కాలు కాలిపోయింది. చదువుకోవడానికి రెండు కిలోమీటర్లు దూరం మిత్రులతో కలిసి వస్తాను. భవిష్యత్తులో డాక్టర్ అయ్యి మా గ్రామానికి మంచి పేరు తెస్తాను."
- మహ్మద్ పర్వేజ్, విద్యార్థి