Kumaraswamy Electricity Theft Case : ఎటువంటి అనుమతి లేకుండా ఇంటికి దగ్గర్లోని ఓ విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించారనే కారణంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామికి రూ.68,526 జరిమానా విధించారు విద్యుత్ శాఖ అధికారులు. ఈ మేరకు ఆ మొత్తాన్ని ఆయన శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యలయంలో చెల్లించారు.
'నన్ను కరెంటు దొంగ అనడం మానండి'
ఒక ఈవెంట్ మేనేజర్ చేసిన పనికి తాను చింతిస్తున్నానని కుమారస్వామి అన్నారు. విద్యుత్ శాఖ విధించిన జరిమానా చెల్లించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పదే పదే తనను కరెంట్ దొంగ అని బయట ప్రస్తావించడం, మీడియాకు ప్రకటనలు ఇవ్వడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. పైగా అధికారులు కూడా దీనిపై బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారని.. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని కుమారస్వామి హితవు పలికారు.
'కాంగ్రెస్ పాదయాత్రకు కరెంట్ ఎక్కడిది?'
'అక్రమంగా వాడిన కరెంట్‌కు సంబంధించి అధికారులను బిల్లు అడిగాను. వారు ఇచ్చిన బిల్లు వివరాలు సరిగ్గా లేవు. మాజీ సీఎంగా నా పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఏటా జరిగే కనకపుర ఉత్సవానికి కరెంట్ ఎక్కడ నుంచి వస్తుంది? అలాగే కాంగ్రెస్ పాదయాత్రలకు విద్యుత్ సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది? ఈ సమయాల్లో ఏమైనా జనరేటర్లు వాడుతున్నారా?' అని కుమారస్వామి ప్రశ్నించారు.