KTR Letter to Central on Vizag Steel Plant : ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా కేంద్రం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందన్న కేటీఆర్... వర్కింగ్ కాపిటల్, ముడి సరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
విశాఖ ఉక్కుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలి : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నమంత్రి కేటీఆర్... స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు. ఒకప్పుడు సిమెంట్ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసిన ప్రభుత్వాలు... ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన ప్రధాని మోదీకి... వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.5 వేల కోట్లు కేటాయించాలన్న కేటీఆర్... ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనాలని పేర్కొన్నారు. సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనంపై పరిశీలించాలని లేఖలో కోరారు.