తెలంగాణ

telangana

ETV Bharat / bharat

KRMB Meeting in Hyderabad : రేపు కేఆర్​ఎంబీ సమావేశం.. చర్చకు రానున్న అంశాలివే.! - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం

KRMB Meeting in Hyderabad Tomorrow: కృష్ణా జలాల్లో చెరి సగం వాటా డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం రేపటి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో మరోమారు బలంగా వినిపించనుంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు సహా, తాగునీటి వినియోగాన్ని 20 శాతంగా పరిగణనలోకి తీసుకోవడం, టెలీమెట్రీ ఏర్పాటు, ఆర్డీఎస్ ఆధునీకరణ అంశాలను ప్రస్తావించనుంది. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టుల పనులను కూడా కృష్ణా బోర్డు సమావేశంలో లేవనెత్తనుంది.

KRMB
KRMB

By

Published : May 9, 2023, 7:03 AM IST

KRMB Meeting in Hyderabad Tomorrow: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం రేపు జరగనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరగనున్న కేఆర్​ఎంబీ భేటీలో రాష్ట్ర వాదనలను మరోసారి బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరిసగం కేటాయించాల్సిందేనని అంటోంది. ఇదే విషయంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం... రేపటి సమావేశంలో మరోమారు వాదన వినిపించనుంది.

రేపటి సమావేశంలో ఆ అంశాలపై చర్చ:పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, డీపీఆర్​ అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లిస్తే... ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఎగువ రాష్ట్రానికి నీటిలో వాటా ఉంటుందని... అందుకు అనుగుణంగా 45 టీఎంసీలు, చిన్న నీటివనరుల్లో వినియోగించుకోని మరో 45 టీఎంసీలతో కలిపి మొత్తం 90 టీఎంసీలతో పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్​ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. అయితే రాష్ట్రాల పరసర్ప అంగీకారం లేదా ట్రైబ్యునల్ తీర్పు లేకుండా దీన్ని పరిశీలించలేమని కేంద్ర జలసంఘం... డీపీఆర్​ను వెనక్కు పంపింది. ఈ పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ కూడా రాసింది. రేపటి సమావేశంలోనూ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతులు, డీపీఆర్​ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఆదేశాలకు లోబడి 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి: తాగునీటి కోసం తీసుకునే నీటిని 20 శాతంగానే లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ వాదిస్తోంది. కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అంటోంది. నీటి ప్రవాహాన్ని గణించేందుకు వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తో పాటు బనకచర్ల ఆఫ్ టేక్ పాయింట్‌పై ఉన్న ఎస్​ఆర్​ఎంసీకి చెందిన అన్ని రెగ్యులేటర్లపైనా రియల్ టైం సెన్సార్లను ఏర్పాట్లు చేయాలని 2016 జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇంత సమయం గడచినప్పటికీ వాటిని ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. సరిపడా నిధులు లేకపోవడంతోనే రెండో దశ టెలిమెట్రీ అమలు జరగడం లేదని బోర్డు అంటోంది. ఆర్డీఎస్ ఆధునీకీకరణ అంశాన్ని కూడా రేపటి సమావేశంలో మరోసారి ప్రస్తావించనున్నారు.

ఆ పనులకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదు: ఆధునీకీకరణ పనులకు ఏపీ సహకరించడం లేదని... దీంతో తెలంగాణ వాటాకు తగినంత నీటిని తీసుకోవడం లేదని ప్రభుత్వం అంటోంది. ఆర్డీఎస్ కుడి కాలువ పనులను ఆంధ్రప్రదేశ్ అనుమతుల్లేకుండా చేపడుతోందని... వాటిని నిలువరించాలని బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో రాష్ట్రం తరపున మూడో సభ్యుడిని కూడా చేర్చాలని ప్రభుత్వం కోరుతోంది. వీటితో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి, సహా ఇతర అంశాలపై కూడా రాష్ట్ర వాదనలను వినిపించనున్నారు. ట్రైబ్యునల్, బోర్డు అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ పలు ప్రాజెక్టులు చేపడుతోందని... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసింది. ఆ అంశాన్ని కూడా రేపటి సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details