గత ఏడాది కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ఇండియా విమాన ప్రమాదంపై నివేదిక(kozhikode plane crash report) విడుదల చేసింది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ). ఆపరేటింగ్ నిబంధనలను పైలట్లు పాటించకపోడమే విమానం కూలిపోవడానికి(plane crash) కారణం కావొచ్చని, అయితే.. ప్రమాదంలో వ్యవస్థాగత వైఫల్యాలను విస్మరించలేమని పేర్కొంది.
"పైలట్లు నిబంధనలు పాటించకపోవటమే ప్రమాదానికి కారణం కావొచ్చు. పైలట్లు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవటం, రన్‌వేపై ల్యాండింగ్ జోన్లో కాకుండా పక్కకు ల్యాండ్ చేయటం సహా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 'గో అరౌండ్' కాల్ ఇచ్చినా.. ఆ సిగ్నల్స్‌ను అందుకోవటంలో విఫలమవటం వల్ల క్రాస్ ల్యాండింగ్ అయి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. ఇందుకు విమానయాన రంగంలోని వ్యవస్థాగత వైఫల్యాలు కూడా ఒక కారణమే. వ్యవస్థలో పని చేసే వ్యక్తులు చేసే తప్పులు, లోపాలు, ఉల్లంఘనలతో భద్రతా వ్యవస్థలో వైఫల్యాలు ఏర్పడి ఈ ప్రమాదాలు జరుగుతాయి."
-నివేదిక
కోజికోడ్ విమాన ప్రమాదంపై(kozhikode plane crash) నివేదికను బహిరంగపరుస్తామని రెండు రోజుల క్రితమే పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అలాగే.. బాధిత కుటుంబాలకు పరిహారం అందించటం పూర్తయినట్లు లోక్‌సభలో తెలిపారు విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. 165 మందిలో 73 మంది పరిహారం తీసుకునేందుకు అంగీకరించగా.. రూ.60.35 కోట్లు అందించినట్లు చెప్పారు.