Kozhikode Gold smuggling: కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు కేజీ బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్‌లో నింపి.. కడుపులో దాచుకొని తరలిస్తున్నట్లు గుర్తించారు.
మలప్పురం జిల్లా వరియంకోడ్‌కు చెందిన నౌఫల్(36) అనే వ్యక్తి దుబాయ్ నుంచి కొజీకోడ్కు వచ్చాడు. 1.063 కేజీల బంగారాన్ని 4 క్యాప్సూల్స్‌గా మార్చి కడుపులో పెట్టుకున్నాడు. పోలీసులు అతడిని తనిఖీ చేసినా బంగారాన్ని కనిపెట్టలేకపోయారు. అయినా అనుమానం వచ్చిన అధికారులు.. నిందితుడు నౌఫల్‌ను కొండొట్టిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతడికి ఎక్స్‌రే తీయగాా కడుపులో ఉన్న నాలుగు బంగారు క్యాప్సూల్స్ బయటపడ్డాయి.
రూ.56 లక్షల విలువ..:బంగాల్ కోల్‌కతా విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ భారతీయ వ్యక్తి నుంచి సుమారు 1,140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 బంగారు నాణేలు, 3 బంగారు కడ్డీలు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ.56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.