Kota Suicide Prevention :కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు (Kota Suicide Rate) ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నివారణకు వసతి గృహాలు, పీజీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగంతో కలిసి.. హాస్టళ్లు, పీజీల యజమానులు ఆత్మహత్య నిరోధక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ వలలను కడుతున్నారు. సాదాసీదాగా కాకుండా.. స్టీల్ వైర్లతో వాటిని నిర్మిస్తున్నారు. ఈ వైర్లు చాలా బలంగా ఉంటాయని ప్రత్యేక పనిముట్లుతో మాత్రమే వీటిని కత్తిరించే వీలుంటుందని నిర్వాహకులు తెలిపారు. బాల్కనీ నుంచి కాకుండా పై అంతస్తు నుంచి దూకినా ఏమీ కాకుండా గ్రౌండ్‌లో వలలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
కోటా హాస్టల్స్, పీజీల్లోని గదుల్లో స్ప్రింగ్ కాయిల్స్ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల ఉరి బిగించుకున్నా ఏం కాదని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లను వేలాడదీసే రాడ్ల కింద స్ప్రింగ్‌లను డిజైన్ చేస్తున్నారు. స్ప్రింగ్ సాగడం వల్ల.. గొంతుపై ఒత్తిడి ఉండకుండా చూస్తున్నారు. విద్యార్థులు చనిపోవాలంటే ఎక్కువగా దూకడం, లేదా ఉరి మార్గాలే ఎంచుకుంటున్నారని అందుకే ఇలా చేస్తున్నట్లు యజమానులు చెప్పారు.
వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని ఆదేశం
ఈ ఏర్పాట్లతో పాటు కోచింగ్ సంస్థలు కచ్చితంగా విద్యార్థులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా.. ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను పాటించని హాస్టళ్లు, పీసీ వసతులను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు.