బంగాల్ కోల్‌కతాలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. రమీషా ఖతున్ అనే నాలుగేళ్ల బాలిక మెట్లపై నుంచి పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై రక్తం గడ్డ కట్టేసింది. బాలిక తల్లి.. రమీషాను అనేక ఆస్పత్రుల్లో తిప్పినా.. ఈ గాయానికి ఎవరూ శస్త్ర చికిత్స నిర్వహించలేకపోయారు.
మెట్లపై నుంచి పడ్డ నాలుగేళ్ల బాలిక.. కోల్‌కతా వైద్యుల సర్జరీతో లక్కీగా.. - కోల్‌కతా మెడికల్ కాలేజ్ లేటెస్ట్ న్యూస్
కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు.. నాలుగేళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది.
బుధవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న రమీషాను ఆమె తల్లి కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. వెంటనే వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌లో బాలిక తలలో రక్తం గడ్డకట్టిందని గుర్తించారు. వెంటనే న్యూరో డిపార్ట్మెంట్ హెడ్ కంచర్ సర్కార్ తలకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. వైద్యులు చేపట్టిన శస్త్ర చికిత్స విజయవంతం కావడం వల్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.
మరోవైపు కోల్‌కతా మెడికల్ కాలేజీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. కాలేజీలో విద్యార్థి పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల తేదీ ప్రకటించేవరకు నిరాహార దీక్షలు చేపడతామని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్, పలు విభాగాల అధిపతులను నిర్బంధించారు. విద్యార్థులు ఇలా చేయడం వల్ల వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని రోగి కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గందరగోళం మధ్య రమీషా ఖతున్ శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల ఆమె తల్లి ఆనందం వ్యక్తం చేశారు.