Kodi Katti Case Accused Letter to CJI: 2018లో విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. 1610 రోజులుగా బెయిల్ రాకుండా జైలులోనే ఉంటున్నానని.. కారాగారం నుంచి తనకు విముక్తి కలిగించాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఇంకా ఎంతకాలం జైలులో ఉండాలో తెలియట్లేదని.. తక్షణం తనకు విముక్తి కలిగించాలని లేఖలో వేడుకున్నాడు. గతంలో ఇదే విషయంపై సీజేఐకు శ్రీనివాస్ తల్లి సావిత్రి సైతం లేఖ రాశారు.
Kodi Katti Case: "నాకు జైలు నుంచి విముక్తి కలిగించండి".. సీజేఐకు కోడికత్తి నిందితుడి లేఖ - కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్
14:33 June 15
1610 రోజులుగా బెయిల్ రాకుండా జైలులోనే ఉంటున్నట్లు నిందితుడు శ్రీను లేఖ
సీజేఐకు శ్రీనివాస్ తల్లి లేఖ: ఈ విషయంపై నిందితుడి శ్రీనివాస్ తల్లి సావిత్రి 2022 జులై 9న లేఖ రాశారు." నా కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగు సంవత్సరాలుగా నా కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్‌ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదు. నా కుమారుడి జేబులో ఉన్న కోడికత్తిని పోలిన చిన్నపాటి పనిముట్టు.. పొరపాటున జగన్ చేతికి గీసుకుపోయింది. దీన్ని పెద్ద రాద్దంతం చేస్తూ నా కుమారుడిపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. 4 ఏళ్లుగా ఎలాంటి విచారణ జరపకుండా జైలులోనే ఉంచారు. తక్షణం ఈ కేసు విచారణ జరిపి.. నా కుమారుడు శ్రీనివాస్‌ను విడుదల చేయాలి" అని సావిత్రి లేఖలో కోరారు.
కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్ర లేదు:కోడికత్తి కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఏడాది ఏప్రిల్ 13న విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని, పథకం ప్రకారమే దాడి జరిగిందన్న జగన్ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్‌కు.. తెలుగుదేశం పార్టీతోనూ, దాడితోనూ సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది. సమగ్ర విచారణ తర్వాతే ఈ విధమైన నిర్ధారణకు వచ్చామన్న ఎన్‌ఐఏ.. తదుపరి దర్యాప్తు అవసరం లేదని, జగన్ పిటిషన్లు కొట్టేయాలని కోర్టును కోరింది. అలాగే దాడికి కొన్ని రోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న జగన్ అభియోగం కూడా ఎంతమాత్రం నిజం కాదని, సీసీటీవీ కెమెరాలన్నీ పనిచేస్తున్నట్లు తేల్చింది. విమానాశ్రయంలో సీసీటీవీ దృశ్యాలను పూర్తిగా విశ్లేషించామని ఎన్‌ఐఏ తెలిపింది.
కోడికత్తి కేసు విచారణ వాయిదా: మరోవైపు కోడికత్తి కేసుపై విజయవాడ NIA కోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను జూలై 4కి వాయిదా వేశారని నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది తెలిపారు.