Kodangal Politics Telangana Assembly Election 2023 : ఇద్దరు వ్యక్తులు తలపడితే.. యుద్ధం.. అదే ఇద్దరి వ్యక్తుల కోసం.. 2 లక్షల మంది కలబడితే.. దానిపేరే కొడంగల్. ఈ దండయాత్రలో దక్కే పదవులకంటే మంచి, మర్యాదలకే విలువెక్కువ. అలాంటిది కొడంగల్‌లో కుర్చీ కొట్లాట వచ్చిందంటే చాలు.. అంతా ఏకమవుతారు. పార్టీలను పక్కన పెడతారు.. మనోడెవరు.. పరాయివాడెవ్వడు.. అని బేరీజు వేసుకుంటారు.. అందుకే... ఇక్కడ జరిగే ఎన్నికల పోరులో... గెలిచేదెవరైనా ఆధిపత్యం మాత్రం ఓటువేసే(Vote Power) ప్రజలదే. నిగ్గదీసి అడగడం అక్కడి వారి నైజం.. నిలదీసి ప్రశ్నించడం కొడంగల్ ఓటర్లు నేర్చుకున్న పాఠం.
'కరెంట్, రైతుబంధుపై- కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు'
Telangana Assembly Elections 2023 : ఇదీ ప్రస్తుతం కొడంగల్‌లో 2023 ఎన్నికల తీరు. సై అంటే సై అంటున్నారు నాయకులు. నువ్వేం చేశావంటే.. నువ్వేం చేశావంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కత్తులతో కాదు.. కళ్లల్లో ఒత్తులేసుకొని ఓట్ల కోసం మాటల యుద్ధం చేస్తున్నారు. గెలిచేది కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి.. మళ్లీ విజయం తమదేనంటూ బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. కొత్త నినాదాలతో(New Slogans) కొడంగల్ రాజకీయం శీతలంలోనూ వేడి పుట్టిస్తున్నారు. గెలిస్తే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి భావిస్తుండగా.. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇచ్చి కొడంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తామంటోంది బీఆర్ఎస్ అధిష్ఠానం.
గుడికి, గడికి మధ్య కొడంగల్ పోరు:ఇక్కడి ఓటర్ల తీర్పు మాత్రం విలక్షణం. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా.. కోట గురున్నాథ్ రెడ్డి, నందారం వెంకటయ్య కుటుంబం మధ్యే సాగింది. గురునాథ్ రెడ్డి గడి, నందారం వెంకయ్య కట్టిన గుడి ప్రతి ఎన్నికకు కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే కొడంగల్ పోరును గుడికి, గడికి మధ్య యుద్ధంగా అభివర్ణిస్తుంటారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా(MLA) గెలిచి గురున్నాథ్ రెడ్డిదే పైచేయి సాధించారు.
ఇక వారం రోజులే గడువు - ఓటర్లను పేరు పేరునా పలకరిస్తున్న నాయకులు
కొడంగల్ రాజకీయ చరిత్ర రేవంత్ రెడ్డి రాకతో పూర్తిగా మారిపోయింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి.. గురునాథ్ రెడ్డి గడి పాలనకు గండికొట్టారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కొడంగల్ ఎన్నికలను గులాబీ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రేవంత్‌కు పట్నం నరేందర్‌రెడ్డి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.
రాష్ట్ర రాజకీయాల్లో కొడంగల్ దంగల్ :ఓడిన చోటే గెలావాలన్న కసితో రేవంత్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగానే కాకుండా పీసీసీ అధ్యక్షుడి హోదాలో పోటీలో దిగడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా భావించిన వారంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు నిలబడ్డారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సహా సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీల మద్దతు దొరకడం రేవంత్ గెలుపు విశ్వాసం రెట్టింపైంది. తన గెలుపు బాధ్యతలను వారి భుజానికెత్తి పీసీసీ అధ్యక్షుడిగా(TPCC Chief) రాష్ట్రంలోని మిగతా అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.