భారత్లో కరోనా రెండో దశ ఎవరూ ఊహించని రీతిలో విధ్వంసం సృష్టిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవించి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖానికి మాస్క్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ప్రజలు ఇక మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలే ప్రకటించాయి. మాస్క్ నుంచి విముక్తిని ప్రసాదించాయి.
భారత్లో కూడా ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందా? అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అటల్ బిహారి వాజ్పేయీ వైద్య కళాశాల డీన్ రాజీవ్ సూద్ ఏమంటున్నారో చూద్దాం.
సగం మందికి పైగా..
అమెరికా లాంటి దేశాల్లో దాదాపు సగం మందికిపైగా వ్యాక్సిన్ వేసినందు వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమైందని రాజీవ్ సూద్ తెలిపారు. అందుకే ప్రజలు ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించవద్దని ప్రకటించారని వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్కు ధరించాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. కార్యాలాయాల్లో అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే మాస్కు అవసరం లేదని అమెరికా ప్రభుత్వం చెప్పిందన్నారు.