Delhi model virtual school : దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. దేశంలో విద్యార్థలందరూ ఈ బడిలో చేరేందుకు అర్హులేనని తెలిపారు. దిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్-డీఎంవీఎస్లో బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టారు. 9 నుంచి 12వ తరగతి వరకు వర్చువల్ పాఠశాలలో బోధిస్తారు. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు వర్చువల్ బడిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కేజ్రీవాల్ చెప్పారు. నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామన్నారు.
దేశంలో ఎక్కడున్నా ఆ బడిలో చేరొచ్చు.. తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం - kejriwal school delhi govt
దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించింది దిల్లీ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఈ బడిలో చేరి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించవచ్చని తెలిపింది. ఇంతకీ ఈ వర్చువల్ స్కూల్ ఎలా పనిచేస్తుంది? పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఆ స్కూల్ సర్టిఫికేట్స్ ఎక్కడైనా చెల్లుతాయా?
దిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్‌ను దేశ విద్యారంగంలో మైలురాయిగా సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. దూరం వంటి అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారని, బాలికలను దూరం పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదని ఆయన చెప్పారు. అలాంటి వారందరికీ విద్యను అందించేందుకు.. దిల్లీ వర్చువల్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చినట్లు కేజ్రీవాల్ వివరించారు. తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు.
వర్చువల్ స్కూల్ ఎలా పనిచేస్తుందంటే..
- ఈ వర్చువల్ స్కూల్ దిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉంటుంది. మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ అన్నీ డీబీఎస్ఈ ఇస్తుంది.
- డీబీఎస్ఈ ఇచ్చే మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ ఇతర బోర్డులు ఇచ్చే ధ్రువపత్రాలతో సమానం. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు.
- వర్చువల్ స్కూల్లో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు.
- తొలి బ్యాచ్‌లో ఎంత మంది విద్యార్థులను తీసుకోవాలో ఇంకా ఏమీ అనుకోలేదు. రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారు.
- స్కూల్‌నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు.
- విద్యార్థుల అటెండన్స్ తీసుకునేందుకు ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలోనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది.
- పరీక్షలు వర్చువల్ మోడ్‌లో జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో టాపిక్‌పై విద్యార్థుల అవగాహనను తెలుసుకునేలా పరీక్షలు ఉంటాయి. వీటిలో కాపీ కొట్టేందుకు అవకాశాలు చాలా తక్కువ. అయితే.. రెండు టెర్మ్-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా దిల్లీకి రావాల్సి ఉంటుంది. దిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి.
- దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్నే వర్చువల్ స్కూల్ కోసం ఎంపిక చేశారు. వీరికి ఆన్లైన్ విధానంలో బోధనపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను బట్టి మరింత మంది ఉపాధ్యాయుల్ని నియమించుకునే విషయాన్ని పరిశీలించనున్నారు.
- వర్చువల్ స్కూల్లో ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో పాఠాలు బోధిస్తారు.