Free Flight Ticket: సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఫ్రీ రీఛార్జి పేరుతోనో, కంపెనీ వార్షికోత్సవం పేరుతోనో ఫేక్ లింక్‌లు సృష్టించి మోసాలకు పాల్పడేవారు.. తాజాగా గివ్ అవే పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశారు. ఫ్రీ విమాన టికెట్లంటూ ఎర వేస్తున్నారు. ఒకవేళ మీకూ అలాంటి లింక్ వచ్చిందా?.. అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పొరపాటున క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.
ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేరిట ఓ లింక్ వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే చిన్న క్విజ్ నిర్వహిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మీకో కొత్త పేజీ దర్శనమిస్తుంది. ఆ తర్వాత మీరు యూరప్ రౌండ్ ట్రిప్ టికెట్లు గెలుచుకున్నారంటూ ఓ సందేశం వస్తుంది. ఈ క్విజ్‌ను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలని అడుగుతుంది. కనీసం 30 మంది ఫ్రెండ్స్ లేదంటే ఐదు వాట్సాప్ గ్రూపులకు పంపించమని కోరుతుంది. ఒకవేళ మీరు నమ్మి అలా షేర్ చేస్తే మీతో పాటు మరో నలుగురిని సైతం ప్రమాదంలోకి నెట్టినట్లే.