తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ మంత్రి కేకే శైలజ సంచలన నిర్ణయం.. ఏం చేశారంటే?

కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఎం సీనియర్‌ నేత కేకే శైలజ ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే అవార్డును తిరస్కరించారు. 'ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరత్వానికి పాల్పడిన దివంగత అధ్యక్షుడు రామన్‌ మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ అవార్డును స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్టు' తెలిపారు.

kk shailaja rejects ramon magsaysay
kk shailaja rejects ramon magsaysay

By

Published : Sep 4, 2022, 8:39 PM IST

KK Shailaja Rejects Ramon Magsaysay : కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఎం సీనియర్‌ నేత కేకే శైలజ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైద్య సేవల నిర్వహణలో సేవలకు మెచ్చి లభించిన ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే అవార్డును తిరస్కరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె.. ఈ అంశంపై పార్టీతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. 'ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరత్వానికి పాల్పడిన దివంగత అధ్యక్షుడు రామన్‌ మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ అవార్డును స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్టు' తెలిపారు. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం- కేరళ ఆరోగ్యశాఖ సమష్టి కృషి ఫలితంగా లభించిన ఈ పురస్కారాన్ని వ్యక్తిగత హోదాలో స్వీకరించేందుకు తనకు ఆసక్తిలేదని ఆమె పేర్కొన్నారు.

"ఎన్జీఓలు కమ్యూనిస్టు భావజాలానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ, నేను ఈ అవార్డును ఓ వ్యక్తిగా స్వీకరించడం సరైంది కాదు. ఎందుకంటే నిజానికి ఈ అవార్డు సమష్టి కృషి ఫలితంగా వచ్చింది. అందుకే ఈ అవార్డును స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాను. వ్యక్తిగత హోదాలో దీన్ని తీసుకోవడానికి నాకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించా" అని శైలజ విలేకర్లతో చెప్పారు.

దీనిపై దిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరమైన అణచివేత చరిత్ర కలిగిన రామన్‌ మెగసెసే పేరుతో ఈ అవార్డు ఉండటం, తదితర కారణాల రీత్యా ఆమె ఈ పురస్కారాన్ని తిరస్కరించారన్నారు. కేరళలో ప్రజారోగ్య సమస్యల నిర్వహణ తీరుకు గాను ఈ పురస్కారం లభించిందని, ఇది కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం- ఆరోగ్యశాఖ సమష్టి కృషి అన్నారు. ఇప్పటివరకు రామన్‌ మెగసెసే పురస్కారం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఏ ఒక్క నేతకూ లభించలేదని చెప్పారు. 1950లలో ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టుల (హక్బలాహప్, సెంట్రల్ లుజోన్ రైతులు ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ గెరిల్లా ఉద్యమం) ఉద్యమాలను అణచివేసిన చరిత్ర మెగసెసేది అంటూ పలువురు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కేకే శైలజ

1957 మార్చిలో ఓ విమాన ప్రమాదంలో మృతిచెందిన అధ్యక్షుడు రామన్‌ మెగసెసే గౌరవార్థం అదే సంవత్సరం నుంచి రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ (ఆర్​బీఎఫ్​) ఆయన పేరిట ఈ అవార్డును ఇస్తోంది. ప్రభుత్వ సర్వీసులు, ప్రజా సేవలు, అంతర్జాతీయ అవగాహన, జర్నలిజం, సాహిత్యం, కమ్యూనిటీ లీడర్‌షిప్‌ వంటి విభాగాల్లో విశేష సేవలందించిన ఫిలిప్పీన్స్‌, ఇతర ఆసియా దేశాల పౌరులకు ప్రదానం చేస్తుంటారు. ఇప్పటివరకు భారత్‌ నుంచి సినీ దిగ్గజం సత్యజిత్‌ రే, కార్టూనిస్ట్‌ ఆర్‌కే లక్ష్మణ్‌, మాజీ ఎన్నికల అధికారి టీఎన్‌ శేషన్‌, లెజెండరీ గాయని ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ, హరితవిప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌, ప్రముఖ పాత్రికేయుడు సాయినాథ్‌, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా అనేకమంది ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందుకున్నవారి జాబితాలో ఉన్నారు.

ఇవీ చదవండి:'దేశంలో విద్వేషం పెరుగుతోంది.. ఆ ఇద్దరు మాత్రం లాభపడుతున్నారు'

పాత బైక్​లపై ఎమ్మెల్యే ఆసక్తి.. 70 ఏళ్ల క్రితం నాటి వాహనాలు భద్రంగా..

ABOUT THE AUTHOR

...view details