జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో అల్ బదర్ ఉగ్రముఠా చీఫ్ గని ఖవాజాను మట్టుబెట్టడం గొప్ప విజయంగా అభివర్ణించారు ఆ రాష్ట్ర ఐజీ విజయ్ కుమార్. భద్రతా బలగాలు, ముష్కరులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో గని హతమయ్యాడు. నియంత్రణ రేఖ ప్రాంతాల్లోని యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడం, కొత్త ముష్కర బృందాలను తయారు చేయడంలో గని కీలక పాత్ర పోషిస్తున్నాడని విజయ్ కుమార్ తెలిపారు.
"తుజ్జార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో సోపోర్ పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. అనంతరం సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది వారితోపాటు తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది కళ్లు కప్పి పారిపోవడానికి, ఖవాజా సహా మరో ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఖావాజాను మట్టుబెట్టాయి "