మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. బీమా సొమ్ముకోసం కొందరు వ్యక్తులు వారి స్నేహితుడిని హత్య చేశారు. మృతుడి పేరుపై ఉన్న రూ.4 కోట్లు బీమా సొమ్మును కాజేయడానికే.. దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అర్జున్ రమేశ్ భలేరావ్ అనే 46 ఏళ్ల ఓ వ్యక్తి నాసిక్‌లోని డియోలలీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే, అతని పేరు మీద రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీంతో అతని మిత్రులు రమేశ్‌ను చంపి ఆ సొమ్మును కాజేయాలని ప్లాన్ చేశారు. కానీ.. రమేశ్ కొన్నాళ్లుగా నాసిక్‌లో లేనందున వారికి అవకాశం లేకపోయింది. మూడేళ్ల తర్వాత రమేశ్ నాసిక్ రాగా.. అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో రమేశ్‌ను హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా.. రమేశ్ ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు చిత్రీకరించారు. బైక్‌పై ప్రయాణిస్తున్న రమేశ్‌ను.. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమేశ్ మరణించిన అనంతరం అతని స్నేహితులు ఆ బీమా సొమ్మును కాజేశారు. ఆ బీమా డబ్బులు పంచుకునే విషయంలో ఐదుగురు నిందితుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారిలో ఒకరు మృతుడి సోదరుడికి అది ప్రమాదం కాదని.. హత్య అని చెప్పాడు. దీంతో మృతుడి సోదరుడు డిసెంబర్ 12న.. బీమా సొమ్ము కోసమే రమేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులకు తెలియజేశాడు.
ఆ బీమా సొమ్ము మొత్తాన్ని మృతుడి భార్య రజినీ ఉకే పేరుతో.. ఓ మహిళ నకిలీ వివరాలను సమర్పించి ఆ డబ్బును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. పోలీసులు నిందితురాలు ఆ మహిళతోపాటు.. మృతుడి స్నేహితుడు మంగేశ్ సావర్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు మంగేశ్ నుంచి ఒక గన్‌తోపాటు ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.