జమ్ముకశ్మీర్‌లో 'ఉగ్రవాదం' తగ్గుముఖం పట్టినట్టు కనపడుతోంది. భద్రతా దళాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాదిలో జులై 7 వరకు జవాన్లు 66మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే అది 48శాతం తక్కువ. 2020లో మొత్తం మీద 215మంది ముష్కరులు మరణించారు. ఐదేళ్లల్లో ఆ సంఖ్య 937గా ఉంది. 2016-19 మధ్య కాలంలో వరుసగా 141, 213, 215, 153మంది.. భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.
ఆ ఒప్పందంతోనే!
1989లో కశ్మీర్లో ఉగ్రవాదం విజృంభించినప్పటి నుంచి 25,315కిపైగా మంది ముష్కరులు చనిపోయారు. ఈ ఏడాది ఉగ్రవాదుల మరణాల సంఖ్య పడిపోవడానికి.. ఫిబ్రవరి 24న భారత్-పాకిస్థాన్‌లు కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఓ కారణం. దీనిబట్టి భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులను పాక్ సైన్యం ఉసిగొల్పిందని స్పష్టమవుతోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడి, ఉగ్రవాదులను దొంగచాటున భారత్‌లోకి పంపించడం పాక్ నైజం.
తాజా ఒప్పందంతో సరిహద్దులో కాల్పుల మోత తగ్గింది. పౌరుల రక్షణ కోసం ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఫిబ్రవరి 24 తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఒక్క కాల్పుల ఘటన కూడా జరగకపోవడం గమనార్హం. 2021లో అప్పటివరకు 592సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపడ్డాయి. 2017లో 971, 2018లో 1,629, 2019లో 3,168, 2020లో 5,133సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగింది.