Boy missing from Visakha railway station : కుటుంబ కలహాలు, భర్త వేధింపుల నేపథ్యంలో ఒంటరిగా ఇల్లు విడిచి వచ్చిన గర్భిణికి ఊహించని కష్టం ఎదురైంది. ఏడాదిన్నర వయస్సున్న కొడుకును వెంటబెట్టుకుని విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమె.. బాలుడు అదృశ్యం కావడంతో కన్నీరుమున్నీరైంది. గురువారం ఉదయం ఈ ఘటన జరగ్గా... సాయంత్రం వరకూ పోలీసులు ఏమీ చేయలేకపోయారు. దీంతో ఆ గర్భిణి.. బిడ్డ ఆచూకీ కోసం తల్లడిల్లిపోతోంది. ‘కుమారుని ముద్దు ముద్దు మాటలు గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి రోదిస్తోంది.
భర్త ఏమైనా హాని తలపెడతాడేమోనని... బాధిత మహిళ.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన కొంగరి భవాని కాగా, ఆమె భర్త లారీ డ్రైవర్. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల నేపథ్యంలో కుమారుడు విజయ్‌కుమార్(18 నెలలు)ను ఏమైనా ఆపద తలపెడతాడేమో అని ఆందోళనకు గురైంది. తన కష్టాలను పుట్టింటి వారు కూడా పట్టించుకోకపోవడంతో ఇల్లు విడిచి దూరంగా వెళ్లిపోవాలని భావించి బిడ్డతో సహా సికింద్రాబాద్ చేరుకుని అక్కడ రైలెక్కింది. బుధవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తెల్లవారే వరకూ ప్లాట్ ఫామ్‌పై ఉండిపోయింది. తెల్లవారుజామున ఒడిశాకు చెందిన ఓ జంట భవానీతో పరిచయం చేసుకొని మాటలు కలిపింది. ఈ క్రమంలో బిడ్డను తన పక్కనే పడుకోపెట్టుకున్న భవానీ.. మెల్లగా నిద్రలోకి జారుకుంది. రాత్రంతా నిద్రలేకపోవడంతో గాఢనిద్రలోకి జారుకున్న ఆమె... కొంత సమయం తరువాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. తనతో మాట్లాడిన ఒడిశా జంట కూడా దగ్గర్లో కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరైంది.