గుజరాత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ సూరత్ ఈస్ట్ అసెంబ్లీ స్థాన పోటీదారుడు బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే ఆయన అలా చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఖండించిన భాజపా ముందు తన ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని కేజ్రీవాల్‌కు హితవు పలికింది.
పోటీ నుంచి తప్పుకున్న ఆప్ అభ్యర్థి.. భాజపా ఒత్తిడే కారణమని కేజ్రీవాల్ పార్టీ ఆరోపణ - ఆప్ సూరత్ అభ్యర్థి కంచన్ జరీవాలా
గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడం రాజకీయంగా దుమారం రేపింది. భాజపా ఒత్తిడే కారణమని ఆప్ ఆరోపించగా.. కమలదళం తోసిపుచ్చింది.
భారీ పోలీసు రక్షణ నడుమ ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకున్న సూరత్ ఈస్ట్ అభ్యర్థి కంచన్ జరీవాలా బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు జరీవాలాను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వారిని వెనెక్కి నెట్టేశారు. దీంతో జరీవాలాను భాజపా నేతలు కిడ్నాప్ చేసి ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆప్ రాష్ట్ర కార్యదర్శి గోపాల్ ఇటాలియా ఆరోపించారు. కంచన్ చుట్టూ ఉన్నవారు భాజపాకు చెందిన గూండాలని అన్నారు. అయితే ఈ ఆరోపణల్ని సూరత్ నగర భాజపా అధ్యక్షుడు నిరంజన్ జాంజ్మేరా తోసిపుచ్చారు. తన ఇంటిని చూసుకోమని కేజ్రీవాల్‌కు హితవు పలికారు. మరోవైవు ఈ విషయంలో తదుపరి చర్య కోసం ఆప్ తన న్యాయ బృందం నుంచి సలహా తీసుకుంటుందని ఇటాలియా తెలిపారు. తమ సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ రాణా కోసం భాజపా ఇదంతా చేసిందని అన్నారు.
"ఆయన స్వయంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని అనుకుంటే.. భారీ పోలీసు రక్షణతో పాటు చుట్టూ 50 నుంచి 100 మంది గూండాలతో కార్యాలయానికి ఎందుకు వస్తారు?" అని ఇటాలియా ప్రశ్నించారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చేందుకు "భాజపా గూండాలు" మంగళవారం జరీవాలాను కిడ్నాప్ చేశారని ఆప్ గుజరాత్ కో-ఇంఛార్జి రాఘవ్ చద్దా సైతం ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే భాజపా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపిన చద్దా.. దీనిపై స్థానిక పోలీసులకు, అధికారులకు కూడా సమాచారం అందించామని చెప్పారు.