Kid Fell Into Borewell : మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది రెండున్నరేళ్ల చిన్నారి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బాలిక ఆడుకుంటుండగా బోరుబావిలో పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ప్రస్తుత పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సీహోర్ జిల్లా ముగావళి గ్రామానికి చెందిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మంగళవారం బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 6 ప్రొక్లేయినర్లు, జేసీబీ ఇతర యంత్రాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదట 30 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రస్తుతం 50 అడుగుల లోతులోకి జారినట్లు తెలుస్తోంది.
'బుధవారం ఉదయం నుంచి జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. లోపల ఒక పెద్ద బండరాయి ఉంది. దానిని డ్రిల్లింగ్ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.అయితే చిన్నారి ఇంకొంచెం కిందకు జారింది. ప్రస్తుతం చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించాము. చిన్నారికి పైప్ సహాయంతో ఆక్సిజన్ అందిస్తున్నాము. రెస్య్కూ సిబ్బంది అధునాతన పద్ధతిలో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు'
- సీహోర్ జిల్లా కలెక్టర్.