ఆడుకోవడానికి బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన చిముకల్య అనే ఓ చిన్నారి.. పెద్ద వాళ్లంతా హడలిపోయే పని చేసింది. పిల్లి అనుకుని దారిలో కనిపించిన ఓ జంతువును వెంట తెచ్చుకుంది. కుటుంబసభ్యులు కూడా మొదట అది పిల్లికూన అనే అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి తెలిసింది అది చిరుత పిల్ల అని. దీంతో వారు ఒక్కక్షణం కంగారు పడిపోయారు. అయితే ఆ చిరుత బాగా చిన్నది అవడం.. ఎలాంటి ప్రాణహాని జరిగే అవకాశం లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర మాలేగావ్‌లోని మోర్జార్ శివరా ప్రాంతంలో నివసిస్తున్న రావ్‌సాహేబ్ ఠాక్రే అనే వ్యక్తి ఇంటి దగ్గర జరిగింది.
కానీ ఏ క్షణంలోనైనా ఆ చిరుత కూన కోసం తల్లి రావొచ్చని భావించిన చిన్నారి కుటుంబసభ్యులు చిరుత పిల్లను వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు. ఎక్కడా తల్లి చిరుత జాడ లేకపోవడం వల్ల ఈ చిరుత పిల్ల గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిన్నారి నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్న అధికారలు చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు.