Stampede in temple: రాజస్థాన్.. సికార్‌లోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని జైపుర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.
పవిత్ర గ్యారాస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖాటూ శ్యామ్ గుడికి పెద్దఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం నాలుగున్నర సమయానికే క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయం తలుపులు తెరవగానే భక్తులు ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో క్యూలో ఉన్న 63 ఏళ్ల మహిళ, మరో ఇద్దరు మహిళలు మరణించారు. మృతుల్లో హిసార్‌కు చెందిన ఓ మహిళ ఉందని పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరు మృతులు ఏ ప్రాంతానికి చెందినవారో ఇంకా తెలియలేదు.
మోదీ సంతాపం
కాగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. 'ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.