Khalistan Flags Found in Assembly: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ముందు కలకలం రేగింది. తపోవన్లోని విధానసభ ప్రధాన ద్వారం వద్ద ఖలిస్థాన్ జెండాలు దర్శనమిచ్చాయి. కొందరు దుండగులు అసెంబ్లీ గేటుకు జెండాలు వేలాడదీయడమే కాకుండా.. గోడలపైనా ఖలిస్థానీ నినాదాలు రాశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని జెండాలను తీసివేశారు. శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయం ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
అసెంబ్లీ గేటు ముందు సీసీటీవీ లేకపోవడం గమనార్హం. అయితే.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత మార్చిలో సిఖ్ ఫర్ జస్టిస్ అధ్యక్షుడు గురుపత్వంత్ సింగ్.. ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్కు బెదిరింపు లేఖ రాశారు. శిమ్లాలో ఖలిస్థాన్ జెండాలు ఎగురవేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఇది వీరి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.