దేవుడిపై భక్తితో వేలంపాటలో లక్షలు ఖర్చు చేసి లడ్డూను దక్కించుకోవడం చూస్తుంటాం. అలాగే దేవుడిపై విశ్వాసం, భక్తి ఉన్నవారు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జరిగింది.
ఇందోర్‌లోని ఖజరానా గణేశ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఓ ప్రసాదాల దుకాణం గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇదే భారత్‌లో అత్యంత ఖరీదైన ప్రసాదాల దుకాణం. కేవలం 60 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దుకాణాన్ని రూ.కోటి 72 లక్షలకు కొనుగోలు చేశారు దేవేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి. అంటే ఒక చదరపు అడుగు అక్షరాలా రూ.2.47 లక్షలు అన్నమాట.
దేవేంద్ర.. గణేశ్ ఆలయ ప్రాంగణంలో లడ్డు ప్రసాదాన్ని విక్రయించేవారు. అయితే ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆలయ పాలకవర్గం కొత్త దుకాణాలను నిర్మించింది. వేలానికి ఆహ్వానించగా.. 6 టెండర్లు వచ్చాయి. భారీ మొత్తం వెచ్చించి దేవేంద్ర ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం దుకాణాన్ని దక్కించుకున్నాడు దేవేంద్ర. ఈ దుకాణానికి 'శ్రీ అష్టవినాయక' అని పేరు పెట్టారు దేవేంద్ర. అలాగే ఈ ప్రసాద విక్రయశాలను గణేశ్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.