Khairtabad Ganesh Height in 2023 : వినాయక చవితి వస్తుందంటే చాలు.. అందరి దృష్టి ఖైరతాబాద్ గణేషుడిపైనే ఉంటుంది. ఈసారి ఎన్ని అడుగుల్లో దర్శనమివ్వనున్నారు.. ఏ అవతారంలో కనువిందు చేయనున్నారనే దానిపైనే అందరి ఫోకస్ ఉంటుంది. అలా.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ సంవత్సరం 61 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం వినాయక విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డిలతో కలిసి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వేద మంత్రాల మధ్య తొలి పూజ (కర్ర పూజ) చేశారు.
Khairtabad Ganesh Height 2023 : ఈ సందర్భంగా గతేడాది వరకు ఉత్సవాలను పర్యవేక్షించిన సింగరి సుదర్శన్ దూరమయ్యారని ఉత్సవ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయన కోరిక మేరకు గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ (69వ ఏట) మట్టి గణేషుడిని ప్రతిష్ఠించనున్నామని తెలిపారు. ఈసారి సెప్టెంబర్ మూడో వారంలో వినాయకచవితి ఉందని.. పండుగకు నాలుగు రోజుల ముందుగానే విగ్రహాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరో వారం, పది రోజుల్లో పనులు ప్రారంభించి.. ఆ తర్వాత విగ్రహ నమూనాను ప్రకటిస్తామని వెల్లడించారు.
'గత సంవత్సరం వరకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను పర్యవేక్షించిన సింగరి సుదర్శన్ ఈసారి దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు పోయిన సంవత్సరం మాదిరిగానే 69వ ఏటా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాం. ఈసారి సెప్టెంబరు నెల మూడో వారంలో వినాయక చవితి పండుగ ఉంది. వారం, పది రోజుల్లో పనులను ప్రారంభిస్తాం. తదుపరి విగ్రహ నమూనాను ప్రకటిస్తాం. పర్వదినానికి నాలుగు రోజుల ముందుగానే విగ్రహం పూర్తవుతుంది.' - గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు
తొలి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత రావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు మహేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ రమణారెడ్డి, సైఫాబాద్ ఏసీసీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు సత్తయ్య, రాజు నాయక్, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.