తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులు- కేంద్రం మధ్య నేడు ఏడో విడత చర్చలు - నూతన సాగు చట్టాలు

సోమవారం.. రైతు సంఘాల నేతలు- కేంద్రం మధ్య 7వ దఫా చర్చలు జరగనున్నాయి. నూతన సాగు చట్టాల రద్దు డిమాండ్​తో రైతులు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. అయితే ఈ భేటీలో సానుకూల ఫలితం దక్కుతుందని కేంద్రం ఆశిస్తోంది.

Key 7th round talks to be held in between Farmers and centre today
రైతులు- కేంద్రం మధ్య నేడు ఏడో విడత చర్చలు

By

Published : Jan 4, 2021, 5:03 AM IST

నూతన సాగు చట్టాలపై దిల్లీలో జరుగుతున్న రైతన్నల పోరాటంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రైతులు- కేంద్రం మధ్య సోమవారం ఏడో విడత చర్చలు జరగనున్నాయి. ఈసారి జరిగే చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారైనా తాము ఆశించిన ఫలితం దక్కకపోతే.. నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి.

దేశ రాజధానిలో అన్నదాతలు గత 39 రోజులుగా ఆందోళనలు తెలుపుతున్నారు. వర్షం, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు వెనకడుగు వేయమని స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 6 సార్లు చర్చలు జరిగాయి. డిసెంబర్​ 30న దిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో కాస్త పురోగతి వచ్చింది. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, దిల్లీలో వాయు నాణ్యత ఆర్డినెన్స్‌, విద్యుత్‌ బిల్లులలో సవరణలకు రైతులు పట్టుబట్టగా.. గాలి నాణ్యత ఆర్డినెన్స్‌, విద్యుత్‌ బిల్లులలో సవరణలకు ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

రాజ్​నాథ్​తో తోమర్​ భేటీ..

ఏడో దఫా చర్చలకు ఒక రోజు ముందు.. వ్యవసాయమంత్రి తోమర్​.. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో భేటీ అయ్యారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కేంద్రం అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ ప్రభుత్వంలో రాజ్​నాథ్​ సింగ్​ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన అనుభవం పనికొస్తుందని కేంద్రం భావిస్తోంది.

ఇదీ చూడండి:-భాజపాకు కుమారస్వామి తీవ్ర హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details