అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారంతా కలిసే పెరిగారు. ఇన్నాళ్లు ఇంటిదగ్గర ఆటపాటల్లోనూ కలిసే గడిపారు. పాఠశాల విద్యాభ్యాసాన్ని కూడా కలిసే ప్రారంభించారు. కేరళలో ఒకే కాన్పులో జన్మించిన చిన్నారులు ఆర్య, ఐశ్వర్య, ఆదర్శ్, అదృశ్య.. ఇప్పుడు ఆన్లైన్లో ఒకటో తరగతి పాఠాలను వింటున్నారు.
అలప్పుజకు చెందిన శశికుమార్- అజిత దంపతులకు ఒకే కాన్పులో నలుగురు కవలలు జన్మించారు. రెండు నెలల సెలవుల తర్వాత కేరళలో జూన్1న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇటీవల పుతియాకావు ఉజువా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు.. శశికుమార్ ఇంటికి వచ్చి, పిల్లల చదువుకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందించారు. దాంతో వారిప్పుడు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు.
మొదట ముగ్గురే అనుకోగా..
అజిత గర్భంతో ఉన్నప్పుడు తన కడుపులో ముగ్గురు చిన్నారులు ఉన్నారని వైద్యులు మొదట భావించారు. అయితే.. సిజేరియన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీసి, కుట్లు వేసే క్రమంలో మరో చిన్నారి కూడా ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు పుట్టిన నాలుగో పాపకు వారు 'అదృశ్య' అని పేరు పెట్టారు. 2015, డిసెంబర్ 8న ఉదయం 7 గంటలకు వీరంతా జన్మించారు.