తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో మహిళలపై దాడులు చేసిన ఘటనలు చాలానే వెలుగు చూశాయి. కానీ, ఓ ప్రబుద్ధుడు సినిమాలను తలపించేలా పథకం రచించి.. తన ప్రేమను కాదన్న యువతిని కటకటాలపాలు చేయలనుకున్నాడు. గంజాయి కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేశాడు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది.
ఏం జరిగిందంటే?
తిరువనంతపురంలోని వళుతకాడ్లో 'వీవర్స్ విలేజ్' పేరుతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు శోభా విశ్వనాథ్. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ఆమెకు తిరువనంతపురంలోని లార్డ్స్ ఆసుపత్రి సీఈఓ హరీశ్ హరిదాస్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడు హరీశ్. అందుకు ఆమె నిరాకరించారు. అప్పటి నుంచి హరీశ్‌ను దూరం పెట్టారు.
శోభపై కోపం పెంచుకున్న హరీశ్.. ఆమెను జైలుపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం రచించాడు. ఆమె దగ్గర పనిచేసే వివేక్ రాజ్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జనవరి 21న, యువతికి చెందిన దుకాణంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మాదక ద్రవ్యాల అక్రమ నిల్వ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎంత చెప్పినా లాభం లేకుండా పోయింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఆమె. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
నిర్దోషిగా తేల్చిన పోలీసులు..