తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విస్మయ మృతికి అతడే కారణం.. కారు నచ్చలేదని.. పెళ్లయిన కొద్ది నెలలకే.. - kerala vismaya news

Kerala Vismaya death: సంచలనం రేపిన ఆయుర్వేద వైద్య విద్యార్థి విస్మయ ఆత్మహత్య కేసులో కేరళ కోర్టు తీర్పు వెలువరించింది. కట్టుకున్న భర్త కట్నం కోసం వేధించి, ఆమె బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని తేల్చింది. దోషికి మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది.

Kerala vismaya case verdict
విస్మయ మృతికి అతడే కారణం.. కారు నచ్చక.. పెళ్లయిన కొద్ది నెలలకే..

By

Published : May 23, 2022, 3:18 PM IST

Kerala Vismaya case: కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన మెడికో విస్మయ ఆత్మహత్య కేసులో తీర్పు వెలువడింది. కొల్లాంలోని న్యాయస్థానం.. ఆమె భర్త కిరణ్​ కుమార్​ను దోషిగా తేల్చింది. 22 ఏళ్ల విస్మయను అతడే కట్నం కోసం వేధించి, బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని నిర్ధరించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. సుప్రీంకోర్టు నుంచి బెయిల్​ పొంది, ప్రస్తుతం బయట తిరుగుతున్న కిరణ్​ను.. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు.

విస్మయ కేసు దోషి కిరణ్

కట్నం కోసం వేధించి, మరణానికి కారణమైతే ఐపీసీలోని 304బీ ప్రకారం కనీసం ఏడేళ్లు జైలు, గరిష్ఠంగా జీవిత ఖైదు పడొచ్చు. కట్నం కోసం వేధించడం(ఐపీసీలోని సెక్షన్ 498ఏ), ఆత్మహత్యకు ఉసిగొల్పడం(ఐపీసీలోని సెక్షన్​ 306) వంటి నేరాలకు వరుసగా మూడేళ్లు, పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ కేసులో దోషిగా సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలా చూస్తామని చెప్పారు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్​రాజ్. ఇది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదని... ఒక సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పని పేర్కొన్నారు.

కొల్లాం కోర్టు తీర్పుతో విస్మయకు న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు హర్షం వ్యక్తం చేశారు. కిరణ్​కు శిక్షతో విస్మయ తిరిగి రాకపోయినా.. భవిష్యత్​లో ఎవరూ ఇలా బలి కాకుండా చూసేందుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దోషికి సాధ్యమైనంత శిక్ష పడాలని ఆకాంక్షించారు.

కిరణ్​-విస్మయ పెళ్లి ఫొటో

ఏం జరిగింది?: విస్మయ.. ఆయుర్వేద వైద్య విద్యార్థి. చదువు పూర్తి కాకముందే 2019 మే 19న ఆమె తల్లిదండ్రులు.. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్​స్పెక్టర్​ అయిన కిరణ్​ కుమార్​తో వివాహం జరిపించారు. కట్నంగా ఆమె తల్లిదండ్రులు.. 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ.10లక్షల కారు ఇచ్చారు. అయితే.. కారు నచ్చలేదని, తనకు రూ.10లక్షలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు కిరణ్. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురిచేసేవాడు.

విస్మయ పెళ్లి ఫొటో

Kerala Vismaya death: 2021 జూన్​ 20న తన బంధువులకు ఓ వాట్సాప్ మెసేజ్ చేసింది విస్మయ. కట్నం కోసం కిరణ్​ తనను వేధిస్తున్నాడని వాపోయింది. అతడు కొట్టడం వల్ల శరీరంపై అయిన గాయాలను ఫొటోలు తీసి అందరికీ పంపింది. మరుసటి రోజు కొల్లాం జిల్లా సస్థంకొట్టలోని కిరణ్ ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.

విస్మయ మృతికి కిరణే కారణమని ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబసభ్యులు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టగా.. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందంటూ 500పేజీలకుపైగా ఉన్న అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ ఛార్జ్​షీట్​ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. మే 17న తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం కిరణ్​ను దోషిగా తేల్చింది.

విస్మయ
విస్మయ

'పాముతో భార్యను చంపి..': పాముతో కాటు వేయించి భార్యను చంపిన ఓ కేసు కూడా ఇటీవల కేరళలో చర్చనీయాంశమైంది. రెండో పెళ్లి చేసుకోవాలన్న కోరికతో తన భార్య ఉత్రాను పాముతో కరిపించి హత్య చేశాడు కొల్లాం వాసి సూరజ్. యూట్యూబ్​లో పాముల ద్వారా ఎలా హత్య చేయాలో తెలుసుకొని పక్కా పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్యకు ఉపయోగించిన పామును ఓ కంటైనర్​లో దాచి ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details