కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికుడికి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బృందం, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) సంయుక్తంగా బుధవారం పట్టుకున్నాయి. కేరళ పోలీసుల బృందం కూడా రత్నగిరికి చేరుకుందని.. నిందితుడు షారుఖ్ సైఫీని వారికి అప్పగిస్తామని ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. నిందితుడు ముఖం, శరీరంపై కాలిన గాయాలున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు.. కన్నూర్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న అలప్పుజ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ రైలు కోచ్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం.. తనిఖీ చేసింది.
నిప్పంటించి.. పారిపోయి.. ఏప్రిల్ 2వ తేదీ(ఆదివారం) రాత్రి అలప్పుజ- కన్నూర్ రైలు కోరపుళ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే డీ1 కంపార్ట్మెంట్లో ఉన్న షారుఫ్ సైఫీ అనే వ్యక్తి తన తోటి ప్రయాణికుడితో గొడవకు దిగాడు. అనంతరం అతనిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. దీంతో డీ1, డీ2 కంపార్ట్మెంట్ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మంటలు ఇతర ప్రయాణికులకు అంటుకోగా.. 9 మంది గాయపడ్డారు. అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగి.. రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు.
9 మంది క్షతగాత్రులను రైల్వే పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత రైల్లో నుంచి ముగ్గురు ప్రయాణికులు కన్పించలేదని గుర్తించిన మిగతా ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సుమారు 100 మీటర్ల దూరంలోని పట్టాలపై 3 మృతదేహాలు కనిపించాయి. వారిలో ఏడాది చిన్నారి సహా ఓ మహిళ, ఓ వ్యక్తి మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో వీరు రైలు నుంచి జారిపడటం లేదా కిందకు దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు పక్కా ప్లాన్‌తోనే అక్కడ నుంచి బైక్‌పై పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసును ప్రత్యేక బృందాల సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన పోలికల ఆధారంగా పోలీసులు నిందితుడికి సంబంధిన స్కెచ్‌ను కూడా గీయించారు. దీంతో పాటుగా పోలీసులకు ట్రాక్‌పై మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కూడా దర్యాప్తు చేస్తోంది.
దీంతో ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఓ అనుమానాస్పద బ్యాగులో మరో పెట్రోల్ బాటిల్, 2 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంలు, ఫోరెన్సిక్ బృందాలు ముమ్మర శోధన చేపట్టాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.