తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీఎస్ లేమితో కళ తప్పిన వామపక్షాల ప్రచారం! - V. S. Achuthanandan Former Chief Minister of Kerala

కేరళలో వామపక్ష రాజకీయ ప్రస్థానంలో మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌ది ప్రత్యేక స్థానం. నిరాడంబరతకు, అంకితభావానికి నిదర్శనంగా నిలిచిన అచ్యుతానందన్‌ లేకుండా సీపీఎం తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచింది. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 'మా కంటి వెలుగు, హృదయ స్పందన వీఎస్' అంటూ ప్రజలు చేసే నినాదాలు ఈసారి వినిపించడం లేదు. వీఎస్ లేకుండా సాగుతున్న వామపక్ష ఎన్నికల ప్రచారం ఈ సారి కళ తప్పిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

V. S. Achuthanandan
వీఎస్ అచ్యుతానందన్

By

Published : Apr 4, 2021, 9:17 AM IST

కేరళలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ అందరి దృష్టి మాజీ సీఎం, సీపీఎం దిగ్గజ నేత అచ్యుతానందన్‌పై కేంద్రీకృతమైంది. ఆయన లేకుండా సీపీఎం తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచింది. 2006 నుంచి 2011 వరకు కేర‌ళ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అచ్యుతానందన్‌.. 2011 నుంచి 2016 వ‌ర‌కు ప్రతిప‌క్ష నేతగా ఉన్నారు. 2006లో తొలుత అచ్యుతానందన్‌కు పార్టీ టికెట్టే ఇవ్వలేదు. అనంతరం నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనకు సీటు కేటాయించారు. మలంబుజా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన అచ్యుతానందన్‌... ఏకంగా కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం పరిపాలనలో తనదైన ముద్ర వేసి ప్రజలకు చేరువయ్యారు. అప్పటినుంచి కేరళలో ఏ ఎన్నిక జరిగినా ప్రచారంలో వీఎస్ పేరు ప్రముఖంగా వినిపించేది.

2016 శాసనసభ ఎన్నికల ప్రచారంలో వీఎస్ అచ్యుతానందన్‌ క్రియాశీల పాత్ర పోషించారు. 93 ఏళ్ల వయసులోనూ నిర్విరామంగా ప్రచారం చేసి సీపీఎం అధికారంలోకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అవినీతికి వ్యతిరేకంగా, సుపరిపాలన కోసం ఓటు వేయాలంటూ వీఎస్ చేసిన విజ్ఞప్తిని కేరళ ప్రజలు విన్నారు. ఆ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్(ఎల్​డీఎఫ్​)కు 91 స్థానాలను కట్టబెట్టారు. మళప్పుజ నియోజకవర్గం నుంచి పోటీ చేసి... అచ్యుతానందన్‌ గెలుపొందారు.

ఆయన లేకపోవడం లోటు!

ప్రస్తుతం 97 ఏళ్ల వీఎస్ అచ్యుతానందన్‌ క్రమంగా రాజకీయ విరమణ దిశగా సాగారు. ఈ ఎన్నికల్లో ఏ స్థానం నుంచి బరిలో లేని ఆయన.. ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అచ్యుతానందన్‌ లేని ప్రభావం వామపక్ష ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1965లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వీఎస్.. 1967లో ఎమ్మెల్యేగా కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 55 ఏళ్లపాటు సాగిన అచ్యుతానందన్‌ రాజకీయ ప్రస్థానంలో.... ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ముద్ర వేశారు. 2006లో ముఖ్యమంత్రిగా వీఎస్ చేసిన పనులు... ఆయనకు ప్రజల మనిషిగా పేరును తెచ్చాయి.

అభిమానులకు నిరాశ

దశాబ్దాల పోరాటాలు, తిరుగుబాటుతో కేరళ ప్రజలకు దగ్గరైన అచ్యుతానందన్‌.... 2006 నుంచి 2016 వరకు జరిగిన ఎన్నికల్లో సీపీఎంను ముందుండి నడిపించారు. ఇప్పుడు వయోభారంతో ఆయన ప్రస్తుత ఎన్నికల ప్రచారానికి దూరం కావడం.. ఆ పార్టీ శ్రేణులను, అభిమానులను నిరాశకు గురిచేసింది.

కేరళ ఎన్నికలపై ప్రత్యేక కథనాలు:

ABOUT THE AUTHOR

...view details