Yashwant Sinha: జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కేరళలోని ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లన్నీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హానే పడనున్నాయి. ఉన్న అన్ని ఓట్లు విపక్ష అభ్యర్థికే పోల్ కానున్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే కానుంది. కేరళలో భాజపాకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేదు. దీంతో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి ప్రతి ఓటు యశ్వంత్ సిన్హాకే రానుంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఒక్క ఓటు కూడా పోల్ అయ్యే అవకాశం లేదు.
President Candidate: కేరళలో అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు 99 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌కు 41 మంది శాసనసభ్యులు ఉన్నారు. లోక్‌సభ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 19 మంది ఉండగా, ఎల్డీఎఫ్కు ఒక్క స్థానం మాత్రమే ఉంది. అలాగే రాజ్యసభలో ఎల్డీఎఫ్కు ఏడుగురు సభ్యులు ఉండగా.. కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో రాష్ట్రం నుంచి ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 29 మంది ఎంపీల ఓట్లు, మొత్తం ఎమ్మెల్యేల ఓట్లు యశ్వంత్ సిన్హాకే పడనున్నాయి.
President Poll: 2017 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో భాజపా అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు కేరళ నుంచి ఒకే ఒక్క ఓటు పడింది. అప్పుడు కమలం పార్టీ నుంచి ఓ రాజగోపాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. ప్రస్తుతం కేరళ భాజపా నేత వి.మురళీధరన్ విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు.