Kerala Story Movie Controversy : సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ చిత్రం' ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర ప్రదర్శనను కొన్నివర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు, ఇతర సిబ్బందికి గుర్తుతెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, మీరు మంచి పనులు చేయలేదని ఆగంతకుడు బెదిరించాడు. ఈ విషయాన్ని దర్శకుడు సుదీప్తో సేన్ ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవటం వల్ల ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులకు మాత్రం పోలీసు భద్రత కల్పించారు.
'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని కొన్నిరాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ ప్రభుత్వం ఇప్పటికే పన్ను మినహాయింపు ఇవ్వగా.. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి సర్కార్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.
మరోవైపు 'ది కేరళ స్టోరీ' చిత్రంపై బంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చిత్రాన్ని నిషేధించిన తొలి రాష్ట్రంగా బంగాల్ నిలిచింది. ఈ సినిమా వక్రీకరించిన కథ అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చిత్రం విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని, శాంతిభద్రతలను కాపాడేందుకే చిత్ర ప్రదర్శనపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 'కశ్మీర్ ఫైల్స్' మాదిరిగా బంగాల్ కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్న మమతా బెనర్జీ.. దానికి భారతీయ జనతా పార్టీ ఫండింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు.
తమిళనాడులోనూ ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. కలెక్షన్లు తగ్గడం, థియేటర్ల వద్ద నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల సంఘం తెలిపింది.