తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల.. రోజుకు లక్ష మంది దర్శనం - శబరిమలప్రజదాలు

శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం లక్ష మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. విపరీతమైన రద్దీ ఉండడంతో మరిన్ని ఏర్పాట్లు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

kerala-sabrimala-temple-sees-record-footfall-as-over-1-lakh-pilgrims-book-for-darshan
Etv Bharatkerala-sabrimala-temple-sees-record-footfall-as-over-1-lakh-pilgrims-book-for-darshan

By

Published : Dec 12, 2022, 5:06 PM IST

కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అదనపు ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిని సమీక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు కేరళ హైకోర్టు కూడా దర్శన సమయాన్ని ఓ గంటపాటు పెంచే అంశాన్ని పరిశీలించాలని ఆలయ అధికారులకు సూచించింది.

శబరిమలలో సోమవారం దర్శనం కోసం రికార్డు స్థాయిలో 1,07,260 మంది భక్తులు ముందస్తు బుకింగ్‌ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికంగా కాగా.. లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి. విపరీతమైన రద్దీని పోలీసులు నియంత్రించలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, భక్తుల సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా పంబ నుంచి సన్నిధానం వరకూ భక్తులను బృందాలుగా అనుమతిస్తున్నట్లు తెలిపారు. రద్దీ నేపథ్యంలో అడవి మార్గంలో భక్తులు ఎవ్వరూ రావద్దని.. ప్రధాన మార్గంలోనే ఆలయానికి చేరుకోవాలని సూచించారు.

కేరళ హైకోర్టు సూచనలు..
శబరిమలలో ఈ శనివారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు బుకింగ్‌ చేసుకోగా 90వేల మంది ఆలయాన్ని దర్శించినట్లు సమాచారం. ఇలా విపరీతమైన రద్దీని నియంత్రించే క్రమంలో కొందరు భక్తులతోపాటు పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శబరిమలలో భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధించి పిటిషన్లను విచారించేందుకు కేరళ హైకోర్టు ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యింది.

రద్దీని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని.. రోజుకు 75వేలకు పైగా భక్తులను దృష్టిలో ఉంచుకోని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం నిత్యం 18గంటలపాటు ఆలయం తెరిచే ఉంటుండగా.. దీనిని మరో అరగంట లేదా ఒక గంటపాటు పెంచే అవకాశాన్ని పరిశీలించే విషయమై శబరిమల ప్రధానార్చకులను సంప్రదించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డుకు సూచించింది. భక్తుల ప్రయాణ మార్గంలో ట్రాఫిక్‌ అవాంతరాలు ఎదురైతే, వారికి మంచినీరు, బిస్కెట్లు వంటివి అందించే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, 41రోజులపాటు కొనసాగే 'మండల పూజ' డిసెంబర్ ​27తో ముగుస్తుంది. దీంతో 'మకరవిళక్కు' కోసం డిసెంబర్​30న ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14, 2023న మకర జ్యోతి దర్శనంతో అది పూర్తవుతుంది. దాంతో ఈ సీజన్‌లో పూజలు పూర్తైన అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించారు. ఈ ఏడాది అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవు. దీంతో నిత్యం భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఆలయాన్ని సందర్శించే బారులు తీరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details