కేరళలో కరోనా కేసులు మంగళవారంతోపోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 22,414 కేసులు నమోదయ్యాయి. మరో 19,478 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 108 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34.71 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,211 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 6,126 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,769 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 30 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,680కి పెరిగింది.
మరోవైపు.. దిల్లీలో 67 మందికి కొత్తగా కరోనా సోకింది. అయితే.. కొత్త కరోనా మరణాలు ఏవీ నమోదు కాలేదు. కరోనా రెండో దశ వ్యాప్తి తర్వాత.. వైరస్ కారణంగా 24 గంటల వ్యవధిలో ఎవరూ మరణించకపోవడం ఇది ఐదోసారి. అంతకుముందు జులై 18, జులై 24, జులై 29, ఆగస్టు 2న కరోనా మరణాలు సున్నాగా నమోదయ్యాయి.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 61 మందికి కరోనా సోకినట్లు తేలగా.. వైరస్ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 66 మంది మరణించారు.
- గుజరాత్లో 15 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్‌లో మరో 18 మందికి కరోనా సోకినట్లు తేలింది.
- తమిళనాడులో కొత్తగా 1,949 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పొరుగు రాష్ట్రం కేరళలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నెగటివ్ ఫలితం, వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 7 గంటల నాటికి దేశవ్యాప్తంగా 48,89,36,423 టీకా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం ఒక్కరోజే.. 33,50,612 టీకా డోసులు అందించినట్లు చెప్పింది.
ఇదీ చూడండి:'మూడో వేవ్ రాలేదు.. వచ్చే అవకాశం తక్కువే!'
ఇదీ చూడండి:కొవిడ్ కట్టడికి కేరళ 'కొత్త వ్యూహం'- గురువారం నుంచే...