భారీ వర్షాలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంగా మార్చాయి. వేల మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డవారి సంఖ్య ఆదివారం నాటికి 26కు పెరిగింది. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 13 మంది. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారంతో పోలిస్తే ఆదివారం వర్షం తీవ్రత తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. కేరళలో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేరళకు అన్నివిధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.
వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది.. కొంతమంది స్థానికులతో కలిసి ఆదివారం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని కూటికల్ గ్రామంలో ఓ ఇల్లు నేలమట్టమైన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో 40 ఏళ్ల వ్యక్తి, ఆయన తల్లి (75), భార్య (35), ముగ్గురు కుమార్తెలు (14, 12, 10) ఉన్నారు. ఓ ప్రాంతంలో ముగ్గురు చిన్నారుల (ఒక్కొక్కరి వయసు 8, 7, 4 ఏళ్లు) మృతదేహాలు బురదలో కూరుకుపోయి కనిపించాయి. వారు ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. కొట్టాయంలోని కూటికల్, ఇడుక్కిలోని కొక్కాయర్‌లలో ప్రజలకు ఆహార పొట్లాలు, నిత్యావసర సరకులు అందించేందుకు నౌకాదళ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. పథనంతిట్టలోని పలు ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న 80 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఇంకా పలువురు విరిగిపడ్డ కొండచరియల కింద చిక్కుకొని ఉండొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
'అప్రమత్తంగా ఉండండి..'