Kerala Police Gun Handling Training: తుపాకీ వినియోగంపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు కేరళ పోలీసులు. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ అనిల్కాంత్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ఇప్పటికే తుపాకీ వినియోగించడానికి లైసెన్స్ ఉన్నవారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తుపాకీని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా అనుభవం లేనివారు రూ.5,000 చెల్లించి శిక్షణ తీసుకోవచ్చు. అలా కాకుండా కాస్త అవగాహన ఉన్నవారు, ఫైన్-ట్యూనింగ్ అవసరం ఉన్నవారు రూ.1000కే శిక్షణ పొందవచ్చు.
అయితే, ఎంపిక ప్రక్రియ మాత్రం కఠినంగా ఉంటుందని, శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంపిక అవ్వరని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అధికారులు. ఎంపికకు ముందు నిపుణులు.. దరఖాస్తుదారుడి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని విశ్లేషిస్తారని తెలిపారు. ఈ సెలక్షన్ ట్రయల్‌లో ఉత్తీర్ణులైన వారికే ఒకసారి శిక్షణ ఇస్తే, ఆయుధాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. అందుకే కఠినంగా ప్రక్రియ చేపడతామని తెలుపుతున్నారు.