తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లోదుస్తులన్నీ ఓకే చోట.. చున్నీ కూడా లేదు'.. నీట్​ అభ్యర్థి తీవ్ర భావోద్వేగం - నీట్ పరీక్ష అండర్​వేర్

Kerala NEET exam issue: కేరళలో నీట్ పరీక్ష వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. విద్యార్థులు తమకు ఎదురైన అవమానకరమైన అనుభవాలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు. మరికొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. మరోవైపు, కళాశాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.

kerala-neet-exam-undergarments
kerala-neet-exam-undergarments

By

Published : Jul 19, 2022, 4:29 PM IST

Updated : Jul 19, 2022, 6:02 PM IST

NEET exam undergarment: నీట్ పరీక్షకు హాజరయ్యే ముందు లోదుస్తులు విప్పాలని సిబ్బంది ఒత్తిడి చేసిన వ్యవహారం సద్దుమణగడం లేదు. మరికొంతమంది విద్యార్థినులు సైతం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. కాగా, పరీక్ష కేంద్రంలో అమానవీయంగా ప్రవర్తించారని ఓ విద్యార్థిని వాపోయింది. అబ్బాయిలు, అమ్మాయిల లోదుస్తులను ఒకే చోట ఉంచారని 'ఈటీవీ భారత్​'కు తెలిపింది.

'పరీక్ష కేంద్రంలో విద్యార్థినుల కోసం రెండు లైన్లు ఏర్పాటు చేశారు. కేంద్రం వద్దకు వెళ్లగానే 'మెటల్ హుక్స్ ఉన్న బ్రా వేసుకున్నారా?' అని అడిగారు. మెటల్ హుక్స్ ఉన్నవారిని ఒక లైన్లోకి, మిగిలినవారిని రెండో లైన్​లోకి వెళ్లమని చెప్పారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. సాధారణ తనిఖీలు చేస్తున్నారని అనుకున్నాం. కానీ గది వద్దకు వెళ్లగానే లోదుస్తులు విప్పేయాలని మహిళా సిబ్బంది అడిగారు. అక్కడే ఉన్న డ్రాలో దుస్తులను పెట్టాలన్నారు. అబ్బాయిలు, అమ్మాయిల దుస్తులన్నీ ఒకే చోట ఉంచారు. ఎగ్జామినేషన్ హాల్​లో అందరూ కలిసే కూర్చున్నారు. మెడలో చున్నీలాంటివి కూడా లేవు. మా జుట్టును ముందుకు వేసుకొని పరీక్ష రాశాం. చాలా అవమానకరంగా అనిపించింది. పరీక్షపై సరిగా దృష్టిసారించలేకపోయాం' అని బాధితురాలు వివరించింది.

ఇదీ చదవండి:నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!

పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా లోదుస్తులు ధరించొద్దని సిబ్బంది చెప్పారని విద్యార్థిని వాపోయింది. 'దుస్తులు వెంట తీసుకొని వెళ్లిపోవాలని చెప్పారు. చాలా మంది ఏడ్చారు. ఎందుకు ఏడుస్తున్నారని ఓ బాలికను కొందరు అడిగారు. పరీక్ష నిర్వహణ వల్లేనని చెప్పాం. అధికారులు వద్దన్నా కొందరు విద్యార్థినులు పరీక్ష అనంతరం అక్కడే గదిలో చీకటిగా ఉన్నచోటకు చేరి, లోదుస్తులు ధరించి ఇంటికి వెళ్లారు. కళాశాలలో సరైన స్థలం, వెలుతురు లేదు. చిన్న గదిలోనే అందరూ దుస్తులు ధరించాల్సి వచ్చింది' అని విద్యార్థిని పేర్కొంది.

విద్యార్థి సంఘాల నిరసన

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా.. విద్యార్థి సంఘాలు ఆందోళకు దిగాయి. ఘటనకు కారణమైన కొల్లం ఆయుర్​లోని 'మార్ థోమా' కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు.. కళాశాల భవనం కిటికీలను ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా.. కొంతమంది ఆందోళనకారులు పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించుకొని కళాశాలలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో విధ్వంసం చోటుచేసుకుంది. నిరసనను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పరిస్థితిని నియంత్రించేందుకు మరిన్ని బలగాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

నిరసనకారుడిని చితకబాదుతున్న పోలీసులు

వారిని గుర్తించేందుకు చర్యలు..
'మార్​ థోమా' కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్షను 10 మందితో కూడిన బృందం పర్యవేక్షించిందని పోలీసులు తెలిపారు. వీరికి గతంలో నీట్ నిర్వహించిన అనుభవం లేదని చెప్పారు. విద్యార్థులను అవమానించిన వారిని గుర్తించేందుకు ఐడెంటిటీ పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:నీట్​ 'లోదుస్తుల' రగడపై ఎన్​టీఏ కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి కేరళ లేఖ

Last Updated : Jul 19, 2022, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details