Monsoon Kerala 2023 : భారత్లోకి రుతుపవనాల రాకపై స్పష్టత కొరవడింది. జూన్ 1నే భారత్లోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా.. వాటి రాక ఆలస్యమైంది. జూన్ 4న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే నెలలో భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఆ అంచనాలన్నీ తప్పాయి. ఇప్పుడు ఈ విషయంపై ఐఎండీ మౌనం వహిస్తోంది. తిరిగి కొత్త తేదీలను సైతం వెల్లడించలేకపోతోంది.
కాగా మంగళవారం ఐఎండీ ఓ బులెటిన్ విడుదల చేసింది. గుజరాత్‌లోని పోర్బందర్కు దక్షిణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయవ్య దిశగా కదిలి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. గోవాకు పశ్చిమంగా నైరుతి దిశలో 920 కి.మీ, ముంబయికి నైరుతి దిశలో 1,120 కి.మీ, పోర్బందర్కు దక్షిణంగా 1,160 కి.మీ, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణంగా 1,520 కి.మీ వేగంతో అల్పపీడనం ఏర్పడిందని.. ఐఎండీ తన ఓ ప్రకటనలో వివరించింది. ఇది దాదాపుగా ఉత్తరం వైపుగా కదిలి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా.. వచ్చే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ అల్పపీడన తీవ్రత దేశంలోకి రుతుపవనాల రాకను ప్రభావితం చేస్తుందని ఐఎండీ వెల్లడించింది. అయితే అందుకు సంబంధించిన సృష్టమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. కాగా స్కైమెట్ వెదర్ అనే ఓ ప్రైవేటు సంస్థ మాత్రం జూన్ 8న లేదా 9న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది.