Monsoon Kerala date : జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను ఐఎండీ వెల్లడించింది. జూన్ 1న.. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది.
ఈ సంవత్సరం వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే వారం రోజుల్లో అరేబియా సముద్రంలో తుపాను వచ్చే అవకాశాలు కూడా లేవని సృష్టం చేసింది. ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి.. పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే కారణమని వెల్లడించింది.
"పాశ్చాత్య దేశాల్లో వాతావరణ అసమతుల్యత కారణంగానే.. భారత్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అందుకే దిల్లీతో పాటు చుట్టుపక్క నగరాలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఒకవేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయి. అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. వ్యవసాయంపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు" అని భారత వాతావరణ శాఖ తెలిపింది.