Saji cheriyan controversy: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యకార, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్రంలోని విపక్షాలు చెరియన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన తలొగ్గాల్సి వచ్చింది.
"నేను రాజీనామా చేశాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. నేను ఎప్పుడూ రాజ్యాంగాన్ని కించపరచ లేదు. నా ప్రసంగంలోని ఓ భాగాన్ని తీసుకుని, వక్రీకరించారు. సీపీఎంను, ఎల్డీఎఫ్ను బలహీనపరిచేందుకే ఇలా చేశారు" అని బుధవారం రాజీనామా అనంతరం ఓ ప్రకటనలో పేర్కొన్నారు చెరియన్.
చెరియన్ ఏమన్నారు?:మల్లపల్లిలో జరిగిన రాజకీయ కార్యక్రమానికి హాజరైన చెరియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని చెరియన్ విమర్శించారు. ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని చెరియన్ స్పష్టం చేశారు.