కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై అధికార దుర్వినియోగం, బంధుప్రీతి అభియోగాలను రాష్ట్ర లోకాయుక్త ఇటీవలే నిర్ధరించింది. ఆయన పదవిలో కొనసాగరాదని ఆదేశిస్తూ ఈ నెల 9న సీఎం పినరయ్ విజయన్‌కు నివేదిక సమర్పించింది. దీంతో తన రాజీనామాను విజయన్‌కు పంపించారు జలీల్. వెంటనే సీఎం ఆ లేఖను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాజీనామా విషయాన్ని ఫేస్బుక్ ద్వారా వెల్లడించిన జలీల్.. దీంతో తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వారికి ఉపశమనం దక్కిందని వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా మీడియా తనపై దాడి చేస్తోందని ఆరోపించారు.