ప్రతి రోజు మనం చెత్త సేకరించే వాళ్లను చూస్తుంటాం. అందులో కొందరు తమ విధుల్లో భాగంగా చేస్తుంటే.. మరికొందరు వ్యర్థాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. కానీ.. పర్యావరణంపై ప్రేమతో చెత్తను సేకరించే వారు చాలా అరుదు. ఆ కోవకు చెందినవారే.. కేరళలోని కొజికోడ్ జిల్లాకు చెందిన రాజన్.
పొలంలో కలుపు ఎక్కువైతే పంట చెడుపోతుంది. అలాగే చెత్త పేరుకుపోతే పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకే అతను వృత్తి రీత్యా రైతే అయినా.. పొలంలో కలుపును తీసినట్లే పరిసరాల్లో చెత్తను సేకరిస్తున్నారు. అందుకే ఆయన్ని స్థానికులు 'కుప్పి రాజన్' అని పిలుస్తారు.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. వైద్యుల సలహా మేరకు రోజూ ఉదయపు నడకను ప్రారంభించారు. అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు.
చెమంచేరి గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో రాజన్ రోజూ ఉదయం.. బహిరంగ ప్రదేశాల్లో కనిపించిన ప్లాస్టిక్ బాటిళ్లు, పర్యావరణానికి హాని చేసే ఇతర వస్తువులను సేకరిస్తున్నారు. ఈ పని చేయడానికి ఆయనెప్పుడూ ఇబ్బంది పడలేదు. సేకరించిన వ్యర్థాలను తన ఇంటి ముందే పోగు చేస్తారు. కేవలం మూడు నెలల్లోనే పంచాయతీలోని రెండు వార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించినట్లు రాజన్ తెలిపారు.