ఈ-కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసిన వస్తువుల స్థానంలో కస్టమర్లకు వేరే వస్తువులు అందుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రూ.70వేలు విలువ చేసే ఐఫోన్ 12ను ఆర్డర్ పెడితే అతడికి ఓ విమ్ సబ్బు, రూ.5 నాణెం వచ్చాయి. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి కూడా ఈ-కామర్స్ సైట్ ద్వారా వింత అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ పెట్టుకునేందుకు ఓ కవర్ కోసం ఆర్డర్ పెడితే.. ఆ కవర్‌తో పాటు ఓ పాస్‌పోర్ట్ కూడా వచ్చింది. వింతగా ఉంది కదూ.. ఈ ఘటన వయనాడ్ జిల్లా కనియమ్బెట్టాలో జరిగింది.
కవర్లో పాస్‌పోర్ట్..
మిథున్ బాబు గత నెల 30న అమెజాన్‌లో ఓ పాస్‌పోర్ట్ కవర్‌ను ఆర్డర్ చేశాడు. ఈ నెల 1న అతడి ఆర్డర్ డెలివరీ అయింది. పార్సెల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మరో వ్యక్తికి చెందిన పాస్‌పోర్ట్ కూడా ఉంది. వెంటనే అతను కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు. అయితే వారు ఇచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోవడం మిథున్ వంతైంది. ఈ తప్పిదం మరోసారి జరగదని.. విక్రయదారుడికి దీనిపై హెచ్చరిస్తామంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు.