తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AIతో ముఖం మార్చుకొని వీడియో కాల్​.. ఫ్రెండ్​ అనుకుని రూ.40వేలు మోసపోయి.. - ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ కేరళ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సాంకేతికతతో ముఖాన్ని మార్చుకొని.. వాట్సాప్​ వీడియో కాల్​ ద్వారా ఓ వ్యక్తిని సైబర్ నేరగాడు మోసం చేశాడు. తన స్నేహితుడని భావించి.. బాధితుడు రూ.40వేలు మోసగాడికి ఇచ్చేశాడు. మళ్లీ అతడు డబ్బులు అడగ్గా.. అనుమానమొచ్చి ఆరా తీస్తే మొత్తం విషయం బయటపడింది. చివరకు ఏమైందంటే?

Kerala Man Lost 40000 Rupees
Kerala Man Lost 40000 Rupees

By

Published : Jul 17, 2023, 10:33 AM IST

దేశంలో గతకొద్ది నెలలుగా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ(AI) గురించే చర్చే. ఏఐ ఉపయోగాలను పక్కనబెడితే.. దీని వల్ల వేర్వేరు రంగాల్లో కోట్లాది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుని సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. AI డీప్​ఫేక్ సాంకేతికత సహాయంతో ముఖాన్ని మార్చుకుని.. వాట్సాప్​ వీడియో కాల్​ ద్వారా ఓ వ్యక్తిని సైబర్​ నేరగాడు మోసం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. రోజుల వ్యవధిలోనే ఈ కేసు చేధించారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల వివరాల ప్రకారం..
కోజికోడ్​కు చెందిన రాధాకృష్ణకు గుర్తుతెలియని నెంబర్​ నుంచి వాట్సాప్​ వీడియో కాల్​ వచ్చింది. అందులో మాట్లాడుతున్న వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్​లో ఉంటున్న తన స్నేహితుడిని పోలి ఉన్నట్లు గుర్తించాడు. వీడియో కాల్​లో మాట్లాడుతూ అతడు (మోసగాడు).. రాధాకృష్ణన్​కు తెలిసిన పేర్లను చెప్పాడు. దీంతో అతడు తన స్నేహితుడేనని రాధాకృష్ణన్​ అనుకున్నాడు.

ఆ తర్వాత మోసగాడు.. తాను దుబాయ్​లో ఉన్నానని, తన బంధువుల చికిత్స కోసం డబ్బులు కావాలని అడిగాడు. భారత్​కు రాగానే ఇచ్చేస్తానని, రూ.40,000 ఇవ్వమని కోరాడు. దీంతో రాధాకృష్ణ అతడికు రూ.40వేలు పంపేశాడు. ఆ తర్వాత మళ్లీ అతడు (మోసగాడు) రూ.35 వేలు అడిగాడు. దీంతో రాధాకృష్ణకు అనుమానం వచ్చి.. తన స్నేహితుడిని సంప్రదించగా అసలు విషయం బయటపడింది.

అప్పుడు.. తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. జులై 15న హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్​ చేసి ఫిర్యాదు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్ విభాగం.. దర్యాప్తు చేపట్టింది. ఫిర్యాదు అందుకున్న రోజుల వ్యవధిలోనే మోసగాడిని గుర్తించింది. అతడి దగ్గర నుంచి మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని రాధాకృష్ణకు తిరిగి అప్పగించింది.

ఫేక్​ కాల్స్​ వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి: పోలీసులు
ఇటీవల రోజుల్లో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయని కేరళ పోలీసులు తెలిపారు. తెలియని నెంబర్​ నుంచి ఆడియో లేదా వీడియో కాల్​ ద్వారా ఎవరైనా ఆర్థిక సహాయం కోరితే స్పందించవద్దని సూచించారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే వెంటనే కేరళ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని కోరారు. హెల్ప్​లైన్​ నెంబర్​.. 24 గంటల పాటు పనిచేస్తుందని పోలీసులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details